సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Geetu Mohandas: టాక్సిక్‌’ తర్వాత కెరీర్‌ ఎలా ఉంటుందో తెలియదు.. కానీ..

ABN, Publish Date - Aug 23 , 2026 | 08:26 AM

భారతీయ తెరపై ఒక భారీ బడ్జెట్‌ సినిమాను, అంతే సాహసంగా తెరకెక్కించిన తొలి డేరింగ్‌ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ (Geetu Mohandas). గత నాలుగేళ్లుగా... అందరి దృష్టి ఆమె తీస్తున్న ‘టాక్సిక్‌’ (Toxic) పైనే.

భారతీయ తెరపై ఒక భారీ బడ్జెట్‌ సినిమాను, అంతే సాహసంగా తెరకెక్కించిన తొలి డేరింగ్‌ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ (Geetu Mohandas). గత నాలుగేళ్లుగా... అందరి దృష్టి ఆమె తీస్తున్న ‘టాక్సిక్‌’ (Toxic) పైనే. యశ్‌లాంటి (yash) పాన్‌ఇండియా స్టార్‌తో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఆ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌ సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి...

ఎంట్రీ అదిరేలా...

చిన్న సినిమాలు కాదు... పెద్ద సినిమాతో వెండితెర మీద మెరవాలనుకున్నా. అందుకే 2013లో ‘లయర్స్‌ డైస్‌’ హిందీ సినిమా తీసి దర్శకురాలిగా పరిచమయ్యా. అది రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు... 87వ అకాడమీ అవార్డులలో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ విభాగంలో మనదేశం తరపున అధికారిక ఎంట్రీని పొందింది. ఆ తర్వాత చిత్రం ‘మూతూన్‌’ హిందీ, తమిళంలో వచ్చింది. ఈ సినిమాకి గ్లోబల్‌ ఫిల్మ్‌మేకర్‌ అవార్డు అందుకున్నా. దర్శకురాలిగా మారిన తర్వాత ఇన్ని అవార్డులు దక్కుతాయని నేనేనాడూ ఊహించలేదు.

తెలుగులో ప్రయత్నించా...

2001లోనే ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘వీడెక్కడి మొగుడండీ’లో సెకండ్‌ హీరోయిన్‌గా వేణు తొట్టెంపూడి సరసన కనిపించా. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో నాకు సరైన అవకాశాలు కూడా రాలేదు.

ఆయన నా లక్కీపర్సన్‌

నా అసలు పేరు గాయత్రీ దాస్‌. పుట్టింది కేరళలోనైనా, పెరిగింది మలేషియా, కెనడాలో. ఐదేళ్ల వయసులో మోహన్‌లాల్‌ గారి ‘ఒన్ను ముతల్‌ పూజ్యం వారే’ సినిమాతో మలయాళ తెరపై బాలనటిగా కనిపించాను. అప్పుడే నా పేరు గీతూగా మారింది. ఆ సినిమాకు ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నా. గమ్మత్తేమిటంటే నేను మొదట హీరోయిన్‌గా చేసింది కూడా మోహన్‌లాల్‌గారి సరసనే. ఆయన నా లక్కీపర్సన్‌.


పాఠ్యాంశంలో నా లఘుచిత్రం

2000 సంవత్సరంలో హీరోయిన్‌గాతమిళ, మలయాళ సినిమాల్లో నటించా. 2009లో నటనకు బ్రేక్‌ ఇచ్చా. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టా. ముందుగా ఒక లఘుచిత్రం తీశా. దానిని ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రోటర్‌ డామ్‌’లో ప్రదర్శించారు. బెస్ట్‌ షార్ట్‌ ఫిక్షన్‌ విభాగంలో మూడు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నా. జాతీయ అవార్డు కూడా వచ్చింది. నా షార్ట్‌ఫిల్మ్‌ను కేరళలో 12వ తరగతి పాఠ్యపుస్తకంలో... ఒక పాఠ్యాంశంగా చేర్చారు. అది నాకు లభించిన గొప్ప గౌరవం.

బంధం బలపడింది

నేను నటించిన ‘శేషం’ అనే మలయాళ సినిమాకు రాజీవ్‌ రవి కెమెరామెన్‌గా పనిచేశాడు. అక్కడే మా ఇద్దరికీ పరిచయం. పన్నెండేళ్ల పాటు మా స్నేహం కొనసాగింది. నా తొలి షార్ట్‌ఫిల్మ్‌కి ఆయనే సినిమాటోగ్రాఫర్‌. 2009లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాం. మాకు ఒక పాప. తన పేరు ఆరాధన. పెళ్లి తర్వాత ఐదేళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చా. అప్పుడే నా భర్త రవి దగ్గర సినిమా దర్శకత్వానికి సంబంధించి అనేక మెలకువలు నేర్చుకున్నా.

విమర్శలు వింటూ చిల్‌ అవుతా!

‘టాక్సిక్‌’ సినిమాకి సంబంధించి యశ్‌ క్యారెక్టర్‌ని రివీల్‌ చేస్తూ గ్లింప్స్‌ విడుదల చేశాం. ఆ సమయంలో నా మీద చాలా విమర్శలొచ్చాయి. ‘ఒక మహిళ అయి ఉండి ఇంటిమేట్‌ సీన్స్‌ అలా తీయడమేంట’ంటూ తీవ్రంగా విమర్శించారు. మహిళను కాబట్టే వారికి మింగుడుపడలేదని తెలుసు. అందుకే విమర్శలను వింటూ, చూస్తూ చిల్‌ అవుతున్నా. సమాజం ఇప్పటికీ మహిళల స్వేచ్ఛ, వారి సమ్మతి, ఆనందం వంటి అంశాలపై చర్చల దశల్లోనే ఉంది.

ఒక డీప్‌ ఎమోషన్‌

తెర మీద యశ్‌ అంటే ఏమిటో అందరికీ తెలుసు. నావరకైతే యశ్‌ కేవలం ఒక స్టార్‌ ప్రొడ్యూసర్‌, బ్రిలియంట్‌ యాక్టర్‌, కో-రైటర్‌ మాత్రమే కాదు... యశ్‌ అంటే ఒక డీప్‌ ఎమోషన్‌. ‘టాక్సిక్‌’ తర్వాత నా కెరీర్‌ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్నెవరూ నమ్మనప్పుడు యశ్‌ నన్ను నమ్మాడు. ఇంత భారీ సినిమా నేను పూర్తి చేయలేనని చాలామంది యశ్‌తో అన్నారు. కానీ నన్ను నమ్మి నాలుగేళ్లకు పైగా నాతో ట్రావెల్‌ చేశాడు. నా టాలెంట్‌పై అంత నమ్మకం ఉంచినం దుకు యశ్‌కి సర్వదా రుణపడి ఉంటా.

Updated Date - Aug 23 , 2026 | 08:54 AM