Mrinalini: పెళ్లి పీటలెక్కనున్న.. 'గద్దలకొండ గణేష్' బుజ్జమ్మ
ABN, Publish Date - Aug 02 , 2026 | 08:55 PM
గద్దలకొండ గణేష్ హీరోయిన్ మృణాళిని రవి పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రియుడు మలేసియాకు చెందిన మహావిష్ణుతో త్వరలోనే వివాహం జరగనుంది.
వరుణ్ తేజ్ గద్దలకొండ గణేశ్ (Gaddalakonda Ganesh) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పాండీచెర్రి బ్యూటీ మృణాలిని రవి (Mrinalini Ravi) జీవితంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. తన చిరకాల ప్రేమికుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వక్త, మలేసియాకు చెందిన మహా విష్ణుతో ఆమె వివాహం జరగనుంది. ఈ విషయాన్ని మృణాళిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా.. ఆమె "నిన్ను ప్రేమించడం అంటే నన్ను నేను ప్రేమించుకోవడమే. ఈ జన్మలోనే కాదు.. ఏ జన్మ అయినా నిన్నే కోరుకుంటా" అంటూ ఆమె రాసిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మృణాళిని రవి, మహావిష్ణు దాదాపు ఏడేళ్లుగా ఒకరికొకరు స్నేహితులు కాగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. అయితే వివాహం ఎప్పుడు, ఎక్కడ జరగనుందనే విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఇదిలాఉంటే.. తొలుత టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాళిని రవి, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో విడుదలైన సూపర్ డీలక్స్ అనే తమిళ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత తమిళంలో 'ఛాంపియన్', 'ఎనిమీ', 'ఎంజీఆర్ మగన్', 'జాంగో', విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. తెలుగులో గద్ద కొండ గణేశ్ సినిమాలో బుజ్జమ్మగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆపై ఆర్గానిక్ మామ హై బ్రీడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర వంటి చిత్రాల్లో నటించింది. 2024లో విజయ్ అంటోనీ హీరోగా వచ్చిన రోమియో అమె చివరి చిత్రం.