Nayanthara: 60 అడుగులతో.. నయనతార భారీ కటౌట్
ABN, Publish Date - Oct 28 , 2026 | 07:03 AM
నయనతార అమ్మవారిగా నటించిన చిత్రం మూక్కుత్తి అమ్మన్-2 దీపావళి సందర్భంగా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు 60 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
ప్రముఖ దర్శకుడు సుందర్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న మూక్కుత్తి అమ్మన్-2 (Mookuthi Amman 2) తెలుగులో మహాశక్తి. ప్రముఖ నటి నయనతార (Nayanthara) అమ్మవారిగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్6న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు 60 అడుగుల భారీ కటౌట్ కట్టారు. చెన్నై నగర శివారు ప్రాంతమైన చెంబరంబాక్కంలోని వేల్స్ థియేటర్ వద్ద ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఒక హీరోయిన్ కు హీరోలతో సమానంగా భారీ కటౌట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
అలాగే, భారతీయ చిత్ర పరిశ్రమలో కథానాయికకు 60 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నటి రాధిక 'తాడికిళవి' చిత్రం కోసం 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. అలాగే, గతంలో కూడా సమంత, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లకు 40 నుంచి 50 అడుగుల కటౌట్లను ఏర్పాటు చేయగా, ఇపుడు నయనతార అభిమానులు తమ అభిమాన హీరోయిన్ కోసం భారీ కటౌట్ ఏర్పాటు చేయడం గమ నార్హం. కాగా, ఈ చిత్రం నవంబరు 6వ తేదీ దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించాయి.
ఐదేళ్ల తర్వాత సూపర్‌స్టార్‌తో లేడీ సూపర్‌స్టార్
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో, ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ (Dharman). ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఇటీవలే ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ‘ది ఆరా ఈజ్ డబుల్.. వెల్కమింగ్ ది వన్ అండ్ ఓన్లీ నయనతార టు ధర్మన్’ అంటూ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
రజనీకాంత్, నయనతార కాంబినేషన్‌కు బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో ‘చంద్రముఖి’, ‘శివాజీ స్పెషల్ సాంగ్‌లో, ‘కథానాయకుడు’, ‘దర్బార్’ వంటి చిత్రాలు వచ్చాయి. చివరగా 2021లో వచ్చిన ‘అన్నాత్తే’ తెలుగులో ‘పెద్దన్న’ తర్వాత దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరూ ‘ధర్మన్’ కోసం మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కథ పరంగా నయనతార పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటికే సిమ్రాన్, రాశీ ఖన్నా, శ్రీలీల, యోగిబాబు వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తుండగా, విలన్ పాత్ర కోసం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని తీసుకున్నారు. 2027 పొంగల్ బరిలో ‘ధర్మన్’ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.