ఇదెక్కడి చోద్యం.. ఇరుముడి, నాన్నకుట్టి పోస్టర్స్ చూస్తే ఎక్కడో తేడా కొడుతుందే
ABN , Publish Date - Jul 26 , 2026 | 10:47 AM
ఇటీవల వంద దేవుళ్లు అంటూ తత్తి సెంటిమెంట్‌తో అలరించిన విజయ్ అంటోని ఇప్పుడు తండ్రి కూతురు ఎమోషన్‌తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
విజయ్ ఆంటోనీ (Vijay Antony), ప్రీతి అస్రానీ (Preethi Asrani ) జంటగా నటించిన అప్పాకుట్టి (Appa Kutti) సినిమా తండ్రీకూతుళ్ళ బంధం. నేపథ్యంలో రూపొందుతోంది. గతంలో తమిళంలో 'బ్లాక్‌మెయిల్' చిత్రానికి దర్శకత్వం వహించిన ఎం.మారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడులకు సిద్ధంగా ఉంది. శుక్రవారం విజయ్ జన్మదినం పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్ర విశేషాలను వివరిస్తూ ' కమర్షియల్, కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందించాం అన్నారు.
తండ్రీ కుమార్తెల మధ్య ఉండే నిస్వార్థ ప్రేమ, త్యాగం, బంధాన్ని తెలిపేలా ప్రధాన కథాంశం ఉంటుందని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. విజయ్ ఆంటోనీ కెరీర్‌లోనే మంచి యాక్షన్ భరిత చిత్రంగా నిలుస్తుంది. ఇప్పటికే అన్ని రకాల నిర్మాణ పనులు పూర్తి చేశాం. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం' అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో నాన్న కుట్టి (Nanna Kutti) పేరుతో తీసుకురానున్నారు.

ఇదిలాఉంటే తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో రవితేజ (Ravi Teja) హీరోగా ఇరుముడి (Irumudi) సినిమా కూడా రూపొందగా చైల్డ్ సెంటిమెంట్, బాండింగ్ అంతకుమించి యాక్షన్ జానర్‌లో సినిమా తెరకెక్కింది. ఆగస్టులో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్, పాటలు ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ నాన్న కుట్టి సినిమా కూడా ఇదే తరహా జానర్‌లో తెరకెక్కినట్లు తాజా పోస్టర్స్ చూస్తే అర్థమవుతుండగా ఈ చిత్రం కూడా ఇంచుమించు ఆగస్టు చివరి నాటికి థియేటర్లకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇరుముడి సినిమాలో తమిళమ్మాయి ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) కీ రోల్ చేస్తుండగా ఈ నాన్న కుట్టిలోనేమో తెలుగమ్మాయి ప్రీతి ఆశ్రాని నటిస్తుండడం విశేషం. అంతేకాదు ఒకే తరహా కథలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు అతి స్వల్ప సమయంలో ప్రేక్షకుల ఎదుటకు రానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
