ధనుష్.. రాజకీయాల్లోకి వస్తే విజయ్‌కి కష్టమే! సీఎం ఆస్థాన జ్యోతిష్యుడు.. అంత మాట అనేశాడేంటి!
ABN, Publish Date - Aug 11 , 2026 | 04:38 PM
తమిళ స్టార్ హీరో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు రతన్ పండిట్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
భవిష్యత్‌లో హీరో ధనుష్ (Dhanush) రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే యోగం ఉందని, అదే జరిగితే రాష్ట్రంలో సరికొత్త పోటీ నెలకొంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay)కు జ్యోతిష్యుడిగా వ్యవహరిస్తున్న రతన్ పండిట్ (Rathan Pandit) వ్యాఖ్యానించారు. తమిళనాట ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన రతన్ పండిట్.. రాష్ట్రంలోని అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెబుతూ ప్రఖ్యాతిగాంచారు.
ముఖ్యంగా ముఖ్య మంత్రి విజయ్ ఆస్థాన జ్యోతిష్యుడిగా ఉన్నారు. గత మే నెలలో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సమయంలో కూడా రతన్ పండిట్ చెప్పిన జ్యోతిష్యం ఫలించడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే పూల బొకేతో విజయ్‌ని కలిసి మరి విజయోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో నటుడు ధనుష్ రాజకీయాల్లోకి వచ్చే యోగం ఉంది. నిజంగానే ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పోటీ ఏర్పడుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay)కి చెప్పుకోదగిన పోటీ లేదు. కానీ, ధనుష్ రాజకీయరంగ ప్రవేశం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరో స్థాయికి వెళతాయి' అని వ్యాఖ్యానించారు.
అయితే.. రతన్ పండిట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ధనుష్ మాత్రం ఇప్పటివరకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆయన నటుడిగా అర డజన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే అభిమాన సంఘాల పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు.