Sai Pallavi: ధనుష్.. మీరు విజయ్ లాగా అసలు చేయొద్దు
ABN, Publish Date - Nov 16 , 2026 | 10:16 AM
హీరో ధనుష్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు కొంతకాలంగా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు కూడా నిర్వహాస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ధనుష్ ఏ రంగంలోకి వెళ్లినా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూనే.. సినిమాలను మాత్రం వదిలేయొద్దంటూ ఆమె చేసిన విజ్ఞప్తి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియ స్వామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో రూపొందిన ఓం (OM Chapter 1) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న సాయి పల్లవి.. ధనుష్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే విజయ్ (vijay) సార్లా సినిమాలు చేయడం మాత్రం ఆపొద్దని ధనుష్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన సినిమాలకు దూరమైతే చిత్ర పరిశ్రమ ఓ అద్భుతమైన నటుడిని కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. ధనుష్ ఎప్పటికీ సినిమాల్లో కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాలు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 'నిజమే ధనుష్ సర్.. మీరు సినిమాలు వదలొద్దు', 'మీ నటనను మిస్ కావాలనుకోవడం లేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాట హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమైన నేపథ్యంలో.. ధనుష్ విషయంలోనూ అలాంటి పరిస్థితి రావొద్దని అభిమానులు భావిస్తున్నారు.
మరి సాయి పల్లవి కోరికను ధనుష్ మన్నిస్తారా? రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ కొనసాగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో తిరుపతి సమీపంలో జరిగిన ఎర్ర చందనం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఈ ఓం చిత్రం తెరకెక్కగా సాయి పల్లవి నెల్లూరు నుంచి వచ్చిన నిత్యా రెడ్డి అనే పవర్ఫుల్ పోలీస్ అఫీసర్‌గా నటిస్తోంది.