Dhanush: బహుముఖ ప్రజ్ఞాశాలిగా ధనుష్.. సిల్వర్ జూబ్లీ
ABN, Publish Date - May 09 , 2026 | 08:28 AM
తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషా చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటున్న ధనుష్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 25 యేళ్ళు పూర్తి చేసుకోనున్నారు.
తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషా చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటున్న ధనుష్ (Dhanush) చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 25 యేళ్ళు పూర్తి చేసుకోనున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘తుళ్ళువదో ఇలమై’. 2002 మే 10వ తేదీ విడుదలైంది. నూతన నటుడిగా పరిచయమైన ఈ చిత్రంలో ధనుష్ ఆకారంపై అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. కానీ, కాలక్రమంలో వాటినన్నింటినీ అధిగమించి స్టార్ హీరోగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, కథా రచయితగా, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా రాణిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తమిళంలో ‘కాదల్ కొండేన్’, ‘తిరుడా తిరుడి’, ‘పుదుపేట’, ‘తిరువిడైయాడల్’, ‘ఆరంభం’, ‘పొల్లాదవన్’, ‘యారడీ నీ మోగిని’, ‘మయక్కం ఎన్న’, ‘మారి’, ‘కొడి’, ‘వడ చెన్నై’, ‘అసురన్’, ‘కర్ణన్’, ‘తిరుచిట్రాంబలం’, ‘వాతి’, ‘రాయన్’ వంటి పలు హిట్ చిత్రాలున్నాయి. (Dhanush 25 Years)
ఈ పాతికేళ్ళ కెరీర్‌లో నటుడిగా, నిర్మాతగా, నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. హీరోగా నటించమే కాకుండా ‘పా.పాండి’, ‘రాయన్’, ‘ఇడ్లీ కడై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరి కొన్ని చిత్రాలను నిర్మించారు. మనలో ఒకడు అనే భావన ప్రేక్షకుల్లో కలగడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ధనుష్ ను అమితంగా ఆరాధిస్తూ, ఒక సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టింది. పాతికేళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగడం అది కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించడం అనేది సాధారణ విజయం కాదని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'కర' చిత్రం విడుదలై చక్కని విజయాన్ని సొంత చేసుకుంది.