Haiku: కోర్ట్ శ్రీదేవి.. తమిళంలో స్టార్ట్ చేసింది
ABN, Publish Date - Feb 01 , 2026 | 08:37 PM
తెలుగు అమ్మాయి శ్రీదేవి అప్పళ్ల కథానాయికగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం హైకూ షూటింగ్ ఆదివారం స్టార్ట్ అయింది.
డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix). మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రెడీ అయింది. ‘జో’ (Joe) మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రొడ్యూసర్స్ నుంచి వస్తోన్న ‘హైకూ’ (Haiku) సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవకముందే ఈ డీల్ క్లోజ్ కావడం ఇంకా విశేషం.
‘జో’, ‘కోళి పన్నై చెల్లదురై’ ఫేమ్ ఏగన్ (Aegan) హీరోగా ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ ఫేమ్ ఫెమినా జార్జ్ (Femina George), లేటెస్ట్ సెన్షేషన్ ‘కోర్ట్’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి శ్రీదేవి అప్పళ్ల (sridevi) కథానాయికలుగా నటిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. ‘జో’ ఫేమ్ హరిహరన్ రామ్ ఈ చిత్రానికి అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 1 ఉదయం కేరళ ఇడుక్కిలో పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పేరన్బు’, ‘తరమణి’ వంటి చిత్రాల దర్శకుడు రామ్ తొలి షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులో ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా.. సినిమా షూటింగ్ అప్‌డేట్స్, రిలీజ్ డేట్ తదితర వివరాలను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.