నయనతారపై వ్యాఖ్యలు.. ఎంపీ క్షమాపణ చెప్పాల్సిందే!
ABN, Publish Date - Mar 17 , 2026 | 08:07 PM
హీరోయిన్ నయనతారపై తమిళనాడు ఎం.పీ. సీవీ షణ్ముగం చేసిన అనుచిత వ్యాఖ్యలతో కోలీవుడ్‌లో దుమారం రేగుతోంది.
హీరోయిన్ నయనతారపై (Nayanatara) తమిళనాడు ఎం.పీ. సీవీ షణ్ముగం (CV Shanmugam) చేసిన అనుచిత వ్యాఖ్యలతో కోలీవుడ్‌లో దుమారం రేగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే తరుణంలో ఆయన నయనతార ప్రస్తావన తీసుకొచ్చి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతపై విల్లుపురంలో మంగళవారం ఎన్డీయే కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు షణ్ముగం, నయనతారను కించపరిచేలా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టాలిన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ 'మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎం హామీకి వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించిన షణ్ముగం అనవసరంగా నయనతార ప్రస్తావన తీసుకొచ్చారు. ‘కలలు కనమని అబ్దుల్ కలాం మనకు చెప్పారు. మన కలలను తనతో పంచుకోవాలని స్టాలిన్ అడుగుతున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే... ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా’ అని వ్యాఖ్యానించారు. మహిళల భద్రత గురించి ఉద్దేశించిన కార్యక్రమంలో షణ్ముగం ఇలా మాట్లాడడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి.
షణ్ముగం కామెంట్లపై డీఎంకే పార్టీ స్పందించింది. ‘మా విధానాలను విమర్శించండి. కానీ, మహిళల గురించి అనుచితంగా మాట్లాడకండి. నయనతారను అవమానించడం ద్వారా మహిళలు అందరినీ మీరు అవమానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు’ అని డీఎంకే పేర్కొంది. ఎంపీ వ్యాఖ్యలను నడిగర సంఘం ఖండించింది. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము ఒప్పుకోమని, బాధ్యతగల పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, నయనతారకు క్షమాపణ చెప్పాలని నడిగర సంఘం డిమాండ్ చేసింది.