అనుపమతో బ్రేకప్.. చిక్కుల్లో ధృవ్ విక్రమ్
ABN, Publish Date - Jul 24 , 2026 | 05:58 PM
తమిళ యువ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) తీవ్ర చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్‌లో నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఫిర్యాదు చేశాయి.
తమిళ యువ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) తీవ్ర చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్‌లో నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఫిర్యాదు చేశాయి. ధృవ్ విక్రమ్ ఒక సినిమా ఒప్పుకోని కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకొని, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడని నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ ని ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది అంటే.. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో ధృవ్‌తో నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ ఓ సినిమా ఓకే చేసి, కోటి రూపాయల అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు పాటలు, సెట్లు, నటీనటుల ముందస్తు ఖర్చుల కోసం భారీగా డబ్బులు వెచ్చించారు. కానీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి, తమకు చెప్పకుండా ధృవ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో కరణ్ దర్శకత్వంలో ఓ సినిమాను #DV4గా అనౌన్స్ చేశాడు.
లెక్క ప్రకారం రమేష్ వర్మతో చేయాల్సిన చిత్రమే #DV4 కావాలని, మైత్రీ మూవీస్ ప్రాజెక్ట్ #DV5 అవ్వాలని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై ధృవ్‌ను ప్రశ్నించగా.. మైత్రీ సినిమా పూర్తయ్యాకే రమేష్ వర్మ సినిమా చేస్తానని రకరకాల కారణాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే తాము భారీగా వడ్డీల భారం మోయాల్సి వస్తుందని, తమకు సమాచారం ఇవ్వకుండా మరో నిర్మాతతో సినిమా మొదలుపెట్టి తమను మోసం చేశారంటూ నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై తమిళ ఫిల్మ్ ఛాంబర్ కూడా ధృవ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
నిజం చెప్పాలంటే ధృవ్ కెరీర్‌లో ఇలాంటి వివాదాలు ఎదురవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ సినిమాలు ఒప్పుకుని అర్థాంతరంగా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. మురుగదాస్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుల సినిమాలు కూడా ఇలాగే ఆగిపోయాయి. ఒక యంగ్ హీరో.. అందులోనూ విక్రమ్ లాంటి స్టార్ హీరో కొడుకు అయ్యి ఉండి.. ఇలాంటి పనులు చేయడం వలన అది విక్రమ్ కి కూడా చెడ్డపేరు తీసుకొస్తుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ధృవ్ కెరీర్ పై ఇలాంటి ఫిర్యాదులు తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇంకోపక్క ధృవ్ ఇలా మారడానికి కారణం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో బ్రేకప్ కారణమని చెప్పుకొస్తున్నారు. ఆమెతో బ్రేకప్ అవ్వడం వలనే ఈ కుర్ర హీరో ఎటు తేల్చుకోలేక సతమతమవుతున్నాడని టాక్. మరి ఈ విషయమై తండ్రి విక్రమ్ అయినా కొడుకు కెరీర్ ని నిలబెట్టే దిశగా ఏదైనా గట్టి నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి.