'ఆపరేషన్ తుఫాన్'కు బ్రాండ్ అంబాసిడర్లుగా
ABN, Publish Date - Jul 16 , 2026 | 12:00 PM
దక్షిణ భారత రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'ఆపరేషన్ తుఫాన్: ది నార్కో హంట్' పేరుతో భారీ ఉద్యమాన్ని ప్రారంభించనుంది.
దక్షిణ భారత రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'ఆపరేషన్ తుఫాన్: ది నార్కో హంట్' (Operation Toofan 2026) పేరుతో భారీ ఉద్యమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (CM Viajy And Mohanlal), మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితల చెన్నైలో విజయ్‌ను కలిసి ఈ కార్యక్రమంపై చర్చించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. దక్షిణ భారత రాష్ట్రాల మధ్య జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం, యువతలో డ్రగ్స్‌పై అవగాహన పెంచడం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ ఉద్యమంలో భాగంగా మోహన్‌లాల్‌ను తొలి 'తుఫాన్ వారియర్'గా ప్రకటించారు. త్వరలో కేరళలో నిర్వహించే భారీ బహిరంగ సభలో విజయ్, మోహన్‌లాల్ కలిసి పాల్గొని ప్రజలకు డ్రగ్స్ నిర్మూలనపై సందేశం ఇవ్వనున్నారు.
'ఆపరేషన్ తుఫాన్' లో భాగంగా కేరళ పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించనుండగా, తమిళనాడు, కర్ణాటక పోలీసులు కూడా సహకరించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సంస్థల ప్రతినిధులు సమావేశమై డ్రగ్ మాఫియాపై సంయుక్త కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, డీ-అడిక్షన్ కేంద్రాల విస్తరణ, డిజిటల్ నిఘా వ్యవస్థ బలోపేతం వంటి చర్యలు చేపట్టనున్నారు. తీర ప్రాంతాలు, జాతీయ రహదారుల మార్గాల్లో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు మరింత కీలకంగా మారాయి. ప్రభుత్వాల మద్దతుతో పాటు విజయ్, మోహన్‌లాల్ వంటి స్టార్‌ల భాగస్వామ్యం కారణంగా 'ఆపరేషన్ తుఫాన్' 2026లో దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాల్లో ఒకటిగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.