చెక్ బౌన్స్ కేసు.. తమిళ హీరోకు ఏడాది జైలు శిక్ష
ABN, Publish Date - Jul 24 , 2026 | 09:49 AM
తమిళ హీరో విమల్‌కు చెక్ బౌన్స్ కేసులో చెన్నై కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
చెక్ మోసం కేసులో హీరో విమల్ (Vimal)కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై చిన్న కేసుల పరిష్కార కోర్టు తీర్పునిచ్చింది. 'మన్నర్ వాగైయరా' (Mannar Vagaiyara) చిత్రాన్ని విమల్ నిర్మించగా, ఈ చిత్రం ఐదేళ్ల క్రితం విడుదలైంది. ఈ సినిమా నిర్మాణం కోసం రూ.4.5 కోట్ల రుణాన్ని గోపి అనే ఫైనాన్షియర్ వద్ద రుణంగా తీసుకున్నారు.
ఈ రుణాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియలో భాగంగా, విమల్ గతంలో ఒక చెక్ ఇవ్వగా, బ్యాంకు ఖాతాలో తగినంత మొత్తంలో బ్యాలెన్స్ లేకపోవడంతో బౌన్స్ అయింది. ఆ తర్వాత విమల్ రుణం తిరిగి చెల్లించక పోవడంతో ఫైనాన్షియర్ గోపి చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కోసం విమల్ పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు.
ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి ఆర్తి మంగళవారం తీర్పునిస్తూ, ఒక యేడాది జైలు శిక్ష విధించారు. అదేసమయంలో ఈ తీర్పుపై విమల్ తరపు న్యాయవాదులు శిక్షను తాత్కాలింగా నిలిపివేయాలని పిటిష న్ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన జడ్జి శిక్షను తాత్కాలింగా నిలిపివేశారు.