Bharathiraja: ప్రభుత్వ లాంఛనాలతో.. భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
ABN, Publish Date - Jun 12 , 2026 | 08:01 AM
అనారోగ్యం కారణంగా అనంతలోకాలకు చేరుకున్నదిగ్గజ దర్శకుడు భారతీరాజా (bharathiraja)కు కుటుంబ సభ్యులు, సినీ నటీనటులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
అనారోగ్యం కారణంగా అనంతలోకాలకు చేరుకున్నదిగ్గజ దర్శకుడు భారతీరాజా (bharathiraja)కు కుటుంబ సభ్యులు, సినీ నటీనటులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. భారతీరాజా చివరి కోరిక మేరకు దిండిగల్ జిల్లా కొడైకెనాల్ రోడ్డు (ఘాట్ రోడ్డు) వత్తలగుండులోని ఫామ్ హౌస్‌లో గురువారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియ క్రతువులను ఆయన కుమార్తె జనని పూర్తి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు భారతీరాజా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఇందులో భాగంగా, ప్రత్యేక పోలీస్ బృందం గాల్లోకి మూడు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపి, నివాళులర్పించింది. ఆ తర్వాత భారతీరాజా పార్థివదేహాన్ని ఫామ్ హౌస్‌లో ఖననం చేశారు.
ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు నిర్మల్ కుమార్, వన్ని అరసు పాల్గొని అంజలి ఘటించారు. ఇదిలా ఉండగా తమ అభిమాన కళాకారుడిని కడసారి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా, బుధవారం కన్నుమూసిన భారతీ రాజా పార్థిపదేహాన్ని బుధవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తొలుత తేని జిల్లాలోని ఆయన స్వగ్రామానికి, అక్కడ నుంచి దిండిగల్ జిల్లా కొడైకెనాల్ వత్తలగుండు సమీపంలోని పామ్ హౌస్‌కు తరలించిన విషయం తెల్సిందే.
నివాళులర్పించిన తారాలోకం...
భారతీరాజాకు చివరిసారి నివాళులర్పించిన సినీ ప్రముఖుల్లో సుహాసిని, రాధిక, నిరోష, వైరముత్తు, స్నేహన్, సీమాన్, కె.భాగ్య రాజ్, నిళల్గల్ రవి, సముద్రఖని, కరుణాన్, విఘ్నేష్, లక్ష్మణ్, ఆర్ కే సెల్వమణి, రామ్, పేరరసు, రత్నకుమార్, పోన్రామ్, వెట్రి మారన్, ఆమీర్ సహా మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, కేంద్ర కమిటీ సభ్యుడు కె.బాలభారతి, మదురై ఎంపీ సు.వెంకటేశన్, తేని జిల్లా కార్యదర్శి ఎం. రామచంద్రన్, మాజీ మంత్రి ఉదయకుమార్, మాజీ ఎమ్మెల్యే మహేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంత్యక్రియల ఏర్పాట్లను డీఐజీ శశిమోహన్. తేని జిల్లా ఎస్సీ స్నేహప్రియ, దిండిగల్ ఎస్సీ ప్రదీప్, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.