ఆరుగురు స్నేహితులు.. ఓ మిస్టరీ డెత్! ఉత్కంఠభరిత క్రైమ్ డ్రామా 'బీప్'
ABN, Publish Date - Aug 02 , 2026 | 06:18 PM
రాఘవ్ రంగనాథన్ హీరోగా, ఎల్. షణ్ముగ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'బీప్' ఫస్ట్ లుక్ విడుదలైంది.
క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే మరో ఇంటెన్స్ మూవీ 'బీప్' (Beep) విడుదలకు సిద్ధమవుతోంది. ఎంక్వెస్ట్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ తమిళ చిత్రానికి ఎల్. షణ్ముగ సుందర్ (Shanmuga Sundar) కథ, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో మూవీపై ఆసక్తి పెరిగింది. 'సంజుపురం' ఫేం రాఘవ్ రంగనాథన్ (Raghav Ranganathan) హీరోగా నటిస్తుండగా, ప్రేరణా ఖన్నా(Prerana Khanna), యామిని (Yamini) హీరోయిన్లుగా కనిపించనున్నారు. కీలక పాత్రల్లో ప్రియదర్శిని, నితీష్ వీరా నటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు షణ్ముగ సుందర్ మాట్లాడుతూ.. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఐటీ రంగంలో ఉద్యోగం చేసినా తన మనసు ఎప్పుడూ సినిమాలపైనే ఉండేదని చెప్పారు. ఆ కారణంగానే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి 'బైండ్' అనే లఘు చిత్రాన్ని రూపొందించానని తెలిపారు. 1981లో శ్రీలంకలోని జాఫ్నా గ్రంథాలయం దహనం ఘటన ఆధారంగా తెరకెక్కిన ఆ షార్ట్ ఫిల్మ్ జాతీయ అవార్డుల పోటీకి కూడా నామినేట్ అయిందని వెల్లడించారు. దర్శకుడిగా 'బీప్' తన తొలి ఫీచర్ ఫిల్మ్ అని పేర్కొన్న షణ్ముగ సుందర్, ఇది సాధారణ క్రైమ్ కథ కాదన్నారు. తెలివితేటలే ప్రధాన ఆయుధంగా మారే హై కాన్సెప్ట్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. ప్రతి కథలో తుపాకులు, కత్తులు అవసరం ఉండవని, బలమైన ఆలోచనే అసలు బలం అనే సందేశం ఈ చిత్రంలో ఉంటుందని వివరించారు.
ఈ సినిమా కథ ఆరుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వారిలో ఒకరు అనుమానాస్పదంగా మరణించడంతో, మిగిలిన ఐదుగురు ఆ మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎలా బయటపెడతారనేదే కథలో ప్రధాన ఉత్కంఠ. ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యం ఉండేలా స్క్రీన్‌ప్లే రూపొందించామని దర్శకుడు చెప్పారు. మంచి క్రైమ్ థ్రిల్లర్‌లను ఆస్వాదించే ప్రేక్షకులకు 'బీప్' కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.