రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?
ABN, Publish Date - Apr 10 , 2026 | 07:27 PM
'కాంతార' మూడో భాగం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చేదు వార్త వినిపిస్తోంది. కాంతార పార్ట్-3 ఇక లేనట్టేనా..? రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా అని
వరాహ రూపం.. దైవ రిషితం! ఆ గంభీరమైన గొంతు, ఉప్పొంగే ఆవేశం, అడవి తల్లి సాక్షిగా సాగిన ఆ పోరాటం.. యావత్ భారత దేశాన్ని ఉర్రూతలూగించాయి. 15 కోట్లతో తెరకెక్కిన కాంతార చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కాంతార (Kantara), కాంతార ది లెజెండ్ ఒక దాని మించి ఒకటి తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగించాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ విషయంలో గత కొన్ని రోజులుగా అనుమానాలు మొదలయ్యాయి. మూడో భాగం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చేదు వార్త వినిపిస్తోంది. కాంతార పార్ట్-3 ఇక లేనట్టేనా..? రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా అని..?
'కిర్రిక్ పార్టీ'తో మొదలైన రిషబ్ శెట్టి సక్సెస్ ప్రయాణం కాంతారతో శిఖరాగ్రానికి చేరింది. అయితే, ఈ క్రేజ్ పెరిగేకొద్దీ లెక్కలు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రిషబ్ తన తదుపరి ప్రాజెక్టుల్లో ఒక కీలక మార్పు కోరుకుంటున్నాడు. అదే తన భార్య ప్రగతి శెట్టిని సహ నిర్మాతగా చేర్చడం. తన సొంత సినిమాల్లో ఆమెను భాగస్వామిని చేసే విషయంలో రిషబ్ చాలా పట్టుదలగా ఉన్నాడు. కానీ.. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. హోంబలే ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ బ్యానర్, రిషబ్ పెట్టిన ఈ కండిషన్‌కు ఒప్పుకుంటుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. గతంలోనే హోంబలే ఫిల్మ్స్ కు, రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు గుప్పుమన్నాయి. వారి మధ్య ఉన్న కాంట్రాక్ట్ గడువు ముగియడంతో, దాన్ని పునరుద్ధరించే క్రమంలో రిషబ్ తన ఫ్యామిలీని బిజినెస్ లోకి తీసుకురావాలని చూడటం హోంబలే యాజమాన్యానికి పెద్దగా నచ్చలేదట. అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో పడిపోయిందని ఇండస్ట్రీ టాక్. రిషబ్ స్థాయి పెరగడం వల్ల ఆయన తన డిమాండ్లను పెంచారా..? లేక నిర్మాణ సంస్థ పంతానికి పోతోందా..? అనేది తెలియాల్సి ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రిషబ్ శెట్టి దైవాన్ని నమ్ముతారు. ఇటీవలే ఆయన కాంతార హరకె నేమోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ తదుపరి భాగం తీయాలా వద్దా అని దైవాన్ని ప్రార్థించగా.. దైవం నుంచి సానుకూల సంకేతం లభించిందని, ముందుకు వెళ్ళమని ఆదేశం వచ్చిందని ప్రచారం జరిగింది. దైవం ఆజ్ఞ ఇచ్చినా.. ఈ నిర్మాణ వివాదాల వల్ల సినిమా ఆగిపోయేలా ఉండడంతో అటు రిషబ్ ను, ఇటు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇదే సమయంలో రిషబ్ ఇతర భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. ప్రశాంత్ వర్మ సినిమా జై హనుమాన్‌లో ఆయన నటిస్తున్నారు. అలాగే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ లోనూ ఆయన కనిపించబోతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. అంటే.. ఒకవేళ ఒప్పందాలు కుదిరినా, కాంతార-3 పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది.