నటి శ్రీదేవి ఆస్తి కేసు.. విచారణపై మధ్యంతర ‘స్టే’
ABN, Publish Date - Mar 18 , 2026 | 10:38 AM
నటి శ్రీదేవి (Sridevi) కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించి చెంగల్పట్టు మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న విచారణపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.
నటి శ్రీదేవి (Sridevi) కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించి చెంగల్పట్టు మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న విచారణపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. దివంగత నటి శ్రీదేవి 1988లో నగరంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో 4.77 ఎకరాల భూమిని సంబంధ మొదలియార్ కుటుంబీకుల నుంచి కొను గోలు చేశారు. అయితే శ్రీదేవి పై మొదలియార్ కుమారుడు చంద్రశేఖర్ రెండో భార్య, ఆమె కుమారుడు నటరాజన్, కుమార్తె శివకామి ఆ స్థిరాస్తిలో తమకు వాటా ఉందంటూ చెంగల్పట్టు అడిషనల్ కోర్టులో సివిల్ కేసు వేశారు.
ఆ కేసును తోసి పుచ్చాలని శ్రీదేవి భర్త బోనీకపూర్ (Boney Kapoor), కుమార్తెలు జాహ్నవి (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Khushi Kapoor) తదితరులు చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పూర్తి విచారణ ముగిసిన తర్వాతే ఆస్తి యాజమాన్యంపై నిర్ణయం తీసుకోవచ్చంటూ బోనీకపూర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బోనీకపూర్ తదితరులు మద్రాసు హైకోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు.
ఆ అప్పీలులో శ్రీదేవి కొనుగోలు చేసిన భూములలో తమకు వాటా ఉందన్న పిటిషనర్లు తప్పుడు పత్రాలు సమర్పించారని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా చెంగల్పట్టు కోర్టు విచారణను జరుపుతోందని ఆరోపించారు. ఈ అప్పీలుపై విచారణ జరిపిన జస్టీస్ టీవీ తమిళ్సెల్వి ఈ కేసును తుది విచారణ కోసం వచ్చే 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకూ చెంగల్పట్టు మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.