సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shruti Haasan: నా ఫొటోలు మార్ఫింగ్ చేసి.. అలా వాడేసుకుంటున్నారు!

ABN, Publish Date - Aug 09 , 2026 | 05:48 PM

తన ఫొటోలు, వీడియోలను ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారంటూ శ్రుతిహాసన్ కోర్టును ఆశ్రయించారు.

Shruti Haasan

కృత్రిమ మేధ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రముఖ నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, ఇమేజ్‌ను ఉపయోగించి వ్యాపార ప్రయోజనాల కోసం నకిలీ ప్రకటనలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.

తన ముఖాన్ని ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు, వీడియోలు రూపొందించి ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తున్నారని శ్రుతిహాసన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండానే పేరు, ఇమేజ్‌ను ఉపయోగించి పలు ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను ఉపయోగించి నకిలీ ప్రకటనలు సైతం రూపొందిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తన వ్యక్తిగత హక్కులు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సంబంధిత సంస్థల నుంచి రూ.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని శ్రుతిహాసన్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్న కంపెనీల పేర్ల జాబితాను కూడా కోర్టుకు సమర్పించారు.

సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే తరహాలో తన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ సీనియర్ నటి టబు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 09 , 2026 | 05:56 PM