సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ranya Rao Gold Smuggling Case: ఏడాది జైలు.. 113 కిలోల బంగారం.. ఇప్పుడు రూ.89.91 కోట్ల జరిమానా

ABN, Publish Date - Oct 01 , 2026 | 03:20 PM

కన్నడ నటి రణ్యారావుకు క‌స్ట‌మ్స్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ శాఖ ర‌ణ్యారావుకు ఏకంగా 89 కోట్ల 91 లక్షల జరిమానా విధించింది.

Ranya Rao

కన్నడ నటి రణ్యారావు (Ranya Rao) కు క‌స్ట‌మ్స్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో (GOLD SMUGGLING CASE) కస్టమ్స్ శాఖ ర‌ణ్యారావుకు ఏకంగా 89 కోట్ల 91 లక్షల జరిమానా విధించింది. 399 పేజీల సుదీర్ఘ ఆర్డర్‌లో రణ్యారావు బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన పలు కీలక అంశాలను కస్టమ్స్ అధికారులు ప్రస్తావించారు. అసలు రణ్యారావు వద్ద ఎన్ని కిలోల బంగారం పట్టుబడింది..? దర్యాప్తులో ఎన్ని కిలోల బంగారం స్మగ్లింగ్ జరిగినట్లు తేలింది..? ఏడాది పాటు ఆమె ఎందుకు జైలులో ఉన్నారు..? ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు..? తాజాగా విధించిన రూ.89.91 కోట్ల జరిమానా ఎందుకు..? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

2025 మార్చి 3.. బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం.. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన నటి రణ్యారావును DRI అధికారులు అడ్డుకున్నారు. తనిఖీలు చేయగా ఆమె వద్ద భారీగా బంగారం బయటపడింది. ప్ర‌త్యేకంగా త‌యారు చేసుకున్న ఆమె దుస్తుల్లో మొత్తం 14.213 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అప్పటి మార్కెట్ విలువ ప్ర‌కారం ప‌ట్టుబ‌డిన బంగారం సుమారు 12.56 కోట్లు. దీంతో రణ్యారావును అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడటంతోనే కేసు ఆగలేదు. రణ్యారావు నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో 2.67 కోట్ల నగదు తో పాటూ 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ED తెలిపింది. దీంతో ఎయిర్‌పోర్టులో పట్టుబడిన బంగారం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న అనుమానంతో దర్యాప్తు మరింత లోతుగా సాగింది. దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ మరిన్ని విష‌యాలు వెలుగులోకి వచ్చాయి.

రణ్యారావు పలుమార్లు దుబాయ్ తో పాటూ ఇత‌ర ప్రాంతాల‌ నుంచి బంగారం తీసుకొచ్చినట్లు ఆదారాలు ల‌భించాయి. 2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్య మొత్తం 127.287 కిలోల బంగారంను అక్రమంగా తీసుకువ‌చ్చిన‌ట్లు గుర్తించారు. ర‌ణ్యారావు అక్ర‌మంగా తీసుకువ‌చ్చిన ప‌సిడి విలువ సుమారు 102.55 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఈ బంగారం మోత్తాన్ని దేశీయ మార్కెట్‌లో విక్రయించి.. వచ్చిన నగదును హవాలా మార్గాల్లో మళ్లించినట్లు ED క‌నుగొంది. ఈ కేసులో రణ్యారావుతో పాటు తరుణ్ కొండూరు, సహిల్ సకారియా జైన్ తదితరుల పేర్లు కూడా దర్యాప్తులో తెరపైకి వచ్చాయి. బంగారం స్మగ్లింగ్‌తో పాటు హవాలా, మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు జరిగింది. అక్రమంగా వచ్చిన బంగారం విక్రయం ద్వారా వచ్చిన డబ్బును వివిధ మార్గాల్లో తరలించి.. ఆ నిధులను చట్టబద్ధమైన లావాదేవీలుగా చూపించే ప్రయత్నం జరిగినట్లు ED పేర్కొంది.

ఈ కేసులో రణ్యారావుకు సంబంధించిన 34.12 కోట్ల విలువైన ఆస్తులను కూడా ED తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఇక రణ్యారావు జైలు వ్యవహారం కూడా ఈ కేసులో కీలకంగా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెయిల్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే COFEPOSA చట్టం కింద రణ్యారావును ఏడాది పాటు నిర్బంధించారు. స్మగ్లింగ్ కార్యకలాపాలు మళ్లీ కొనసాగించే అవకాశం ఉందన్న కారణంతో నిరోధక చర్యగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్బంధాన్ని రణ్యారావు కోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు నిర్బంధ ఉత్తర్వును సమర్థించింది. COFEPOSA కింద ఏడాది నిర్బంధ కాలం 2026 ఏప్రిల్ 22న పూర్తవడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. అయితే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విచారణ... న్యాయ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. DRI మాత్రం Customs Act కింద రణ్యారావుకు గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని కోర్టును కోరింది. దీనిపై విచార‌ణ ఇంకా కొన‌సాగుతోంది.

తాజాగా ఈ కేసులో మరో భారీ పరిణామం చోటుచేసుకుంది. రణ్యారావుకు 89 కోట్ల 91 లక్షల జరిమానాను కస్టమ్స్ శాఖ పెనాల్టీ విధించింది. 399 పేజీల కస్టమ్స్ అడ్జుడికేషన్ ఆర్డర్ లో బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన పలు కీల‌క అంశాలను నమోదు చేసింది. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి మధ్య సుమారు 113 కిలోల బంగారం దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలించినట్లు తాజా కస్టమ్స్ ఆర్డర్‌లో పేర్కొంది.

బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14.213 కిలోల బంగారంతో పట్టుబడిన ఘటనతో మొదలైన రణ్యారావు కేసు.. ఆ తర్వాత కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాల స్వాధీనం.. వందల కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్.. హవాలా, మనీలాండరింగ్ వంటి అంశాలతో పాటూ.. కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్.. ఏడాది పాటు COFEPOSA నిర్బంధం.. ఇప్పుడు 89.91 కోట్ల భారీ కస్టమ్స్ జరిమానా వరకు వచ్చింది. ఏడాది నిర్బంధం పూర్తవడంతో రణ్యారావు బయటకు వచ్చినా.. గోల్డ్ స్మగ్లింగ్ కేసు మాత్రం ఇంకా ముగియలేదు. ఒకవైపు కోర్టులో కేసు.. మరోవైపు కోట్ల రూపాయల జరిమానా.. ఈ కేసులో తుది పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Updated Date - Oct 01 , 2026 | 03:21 PM