Divya Spandana: మగాళ్లను కుక్కలతో పోల్చిన హీరోయిన్..
ABN, Publish Date - Jan 09 , 2026 | 03:58 PM
కోలీవుడ్ నటి దివ్య స్పందన (Divya Spandana) అలియాస్ రమ్య (Ramya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Divya Spandana: కోలీవుడ్ నటి దివ్య స్పందన (Divya Spandana) అలియాస్ రమ్య (Ramya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అభి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో కనిపించకపోయినా తమిళ్ సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా దివ్య స్పందనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. సినిమాలతో కాకుండా అమ్మడు వివాదాలతో ఎక్కువ పాపులర్ అయ్యింది.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. 2013లో దివ్య స్పందన మాండ్య నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో .. ఇటు సినిమాల్లో నటిస్తూ బిజీగామారింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఆమె .. తాజాగా మగాళ్లను కుక్కలతో పోలుస్తూ ఒక పోస్ట్ పెట్టింది. అది సినీ, రాజకీయ రంగాలలో సంచలనంగా మారింది.
అసలు విషయమేంటంటే.. గత కొన్నిరోజులుగా వీధి కుక్కలు.. ప్రజలపై దాడికి దిగుతున్న విషయం తెల్సిందే. చిన్నా, పెద్ద, ముసలి, ముతకా అనే తేడా లేకుండా కుక్కలు దాడికి పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు అధికారులకు మొరపెట్టుకోగా.. వీధి కుక్కలను ఏం చేయాలి అనే కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇక కోర్టు.. కుక్కల్లో ఏది మంచిది.. ఏది చెడ్డది.. ఏది కరుస్తుంది.. ఏది కరవదు అని చెప్పడం చాలా కష్టం కనుక.. అన్ని కుక్కలను తీసుకెళ్లి ప్రత్యేక కేంద్రాలలో ఉంచమని తీర్పు ఇచ్చింది.
ఇక ఈ తీర్పుపై దివ్య స్పందన వ్యంగ్యంగా స్పందించింది. ' మగాళ్ల మైండ్ సెట్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చదవలేరు. వారు ఎప్పుడు రేప్ చేస్తారో.. ? ఎప్పుడు హత్య చేస్తారో ఎవరికి తెలియదు. అందుకని అందరి మగాళ్లను జైల్లో పెడతారా.. ? ' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ మగాళ్లు ఫైర్ అయ్యారు. మగవారు, కుక్కలు ఒకటేనా.. ? మగాళ్లను కుక్కలతో పోలుస్తావా.. ? అంటూ మండిపడుతున్నారు. మరి దీనిపై దివ్య స్పందన ఎలా స్పందిస్తుందో చూడాలి.