సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

R Parthiban: అందరికీ.. కుల, మతాతీత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి!

ABN, Publish Date - Aug 02 , 2026 | 07:27 PM

కుల, మతాతీత ధ్రువీకరణ పత్రాలు కోరుకునే వారికి చట్టబద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నటుడు ఆర్. పార్తిబన్ మద్రాస్ హైకోర్టులో PIL దాఖలు చేశారు.

R Parthiban

తమిళ నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ (R. Parthiban) మరోసారి వార్తల్లో నిలిచారు. కుల, మతాతీత ధ్రువీకరణ పత్రాలు (Caste and Religion Neutral Certificate) కోరుకునే వారికి తక్షణమే ఆ పత్రాలు జారీ చేసేలా చట్టం రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు పార్తిబన్ స్వయంగా కుల, మతాతీత ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఆ ధ్రువీకరణ పత్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దండపాణి ఎదుట సమర్పించారు.ఆ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఈ సౌకర్యం ఒక్క పార్తిబన్‌కే పరిమితం కాకుండా, ఇలాంటి ధ్రువీకరణ పత్రాలు కోరుకునే ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని అప్పుడే పార్తిబన్ వెల్లడించారు.

పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, కుల, మతాతీత ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించే విధానంపై రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని 2025 జూన్‌లో హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం అలాంటి అడ్డంకులు లేని నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకురావాలని పార్తిబన్ తన పిటిషన్‌లో కోరారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి శుష్రత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ అరుల్ మురుగన్‌ల ధర్మాసనం ఆగస్టు 3న విచారణ చేపట్టనుంది.

Updated Date - Aug 02 , 2026 | 07:36 PM