సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wamiqa Gabbi: వామికా గబ్బి కెరీర్‌లో బిగ్‌ టర్నింగ్‌ పాయింట్‌

ABN, Publish Date - Aug 10 , 2026 | 02:02 PM

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది సాధారణ విషయం కాదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, దానితో పాటు అదృష్టం, సరైన సమయం కూడా కలిసి రావాలి.

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది సాధారణ విషయం కాదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, దానితో పాటు అదృష్టం, సరైన సమయం కూడా కలిసి రావాలి. ఈ రెండింటిలో ఏది తగ్గినా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం చాలా కష్టం. ముఖ్యంగా కథానాయికల విషయంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. కానీ కొందరు మాత్రం విజయం దక్కే వరకు ఓపికగా కష్టపడుతూనే ఉంటారు. ఒకసారి సరైన హిట్‌ పడితే, ఇక వెనుతిరిగి చూసుకోకుండా దూసుకెళ్తుంటారు. ప్రస్తుతం సరిగ్గా ఇదే తరహా క్రేజీ ఫేజ్‌ను అనుభవిస్తోంది అందాల భామ వామికా గబ్బి (Wamiqa Gabbi)

బాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘జబ్ వుయ్ మెట్’ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత తెలుగులో ‘భలే మంచి రోజు’ (Bhale Manchi roju) సినిమాతో మన ప్రేక్షకులను అలరించింది. అనంతరం ‘మాలై నేరత్తు మాయకమ్’ చిత్రంతో కోలీవుడ్‌లోనూ మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆయా సినిమాల్లో ఆమె నటనకు, పర్‌ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడినా, కొత్త అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో తలుపు తట్టలేదు. కెరీర్‌లో ఎన్ని నంబర్స్ సాధించినా, ఎన్ని సినిమాలు చేసినా రావాల్సిన గుర్తింపు రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. అయితే అవకాశాలు తగ్గిన సమయంలో కూడా ఈ భామ అధైర్యపడలేదు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ ముందుకు సాగింది. సినిమా అవకాశాల్లో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వామిక బాగా సద్వినియోగం చేసుకుంది. వరుస వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనలోని వైవిధ్యాన్ని నిరూపించుకుంది. అలా ప్రతి అడుగులోనూ నటనను మరింత పదును పెట్టుకుంటూ సరైన సమయం కోసం వేచి చూసింది.

దాదాపు దశాబ్దం తర్వాత కోలీవుడ్‌లో లోకేష్ కనగరాజు నటించిన ‘డీసీ’ చిత్రంతో కోలీవుడ్‌లో మళ్లీ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ‘డీసీ’ సినిమాలో వ్యభిచార గృహంలో మగ్గిపోయి, బయటి ప్రపంచం తెలియని చీకటి జీవితాన్ని అనుభవించిన చంద్ర పాత్రలో వామిక కనబరిచిన నటనకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె ఇచ్చిన పర్‌ఫార్మెన్స్, ప్రధాన నటీనటులతో పాటు లోకేష్ కనగరాజు పాత్రను సైతం డామినేట్ చేసేలా సాగడం విశేషం. ఈ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీనికి తోడు బాలీవుడ్‌లో ‘భూత్ బంగ్లా’ చిత్రంతోనూ ఘన విజయం సాధించడంతో, ఈ ఒక్క ఏడాదే అమ్మడికి డబుల్ హిట్ లభించినట్లయింది. 19 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత దక్కిన ఈ సక్సెస్‌తో వామికా గ్రాఫ్‌ ఒక్కసారిగా పైకి లేచింది. ప్రస్తుతం తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న ‘గూఢచారి’ సీక్వెల్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఇది కాకుండా తమిళం, హిందీ భాషల్లో మరో అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే విజయం ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుందని వామికా నిరూపించింది. మరి ఈ భారీ విజయం ఆమె కెరీర్‌కు ఎలాంటి పెద్ద టర్నింగ్ పాయింట్ కానుందో వేచి చూడాలి.

Updated Date - Aug 10 , 2026 | 02:14 PM