16 ఏళ్ల తర్వాత.. రంభ రీ ఎంట్రీ
ABN, Publish Date - Feb 18 , 2026 | 06:59 AM
సీనియర్ సినీ నటి రంభ (Rambha) 16 యేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరపై మళ్ళీ కనిపించనున్నారు.
సీనియర్ సినీ నటి రంభ (Rambha) 16 యేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించనున్నారు. 90 దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రంభ, 1992లో సర్గమ్ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ సినిమా తెలుగులో సరిగమలు పేరుతో విడుదలైంది. అదే యేడాది ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌కు జోడీగా నటించి తెలుగులో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఆమెకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆపై సంవత్సరం కార్తీక్ హీరోగా నటించిన 'ఉల్లత్తై అల్లిత్తా' సినిమా ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యింది.
ఆ తర్వాత నుంచి రెండు దశాబ్దాల వరకు ఆమె కెరీర్ విజయవంతంగా కొనసాగింది. చిరంజీవి, రజనీ కాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, శివరాజ్ కుమార్, సల్మాన్ ఖాన్, గోవింద, మిథున్ చక్రవర్తి, అక్షయ్ కుమార్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన కథానాయికగా చేసి ఓ వెలుగు వెలిగింది. అటుపై బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టి అక్కడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అంతేగాక కన్నడ, బెంగాలీ, భోజ్‌ఫురి, ఓ ఆంగ్ల చిత్రంలోనూ నటించి మెప్పించింది. ఆమె నటించిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఆమెకు అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే.
తెలుగులో ఆమె చివరి చిత్రం 'దొంగ సచ్చినోళ్లు'. తమిళంలో 2010లో 'పెణ్ సింగం' అనే చిత్రంలో చివరగా నటించినప్పటికీ అది విడుదల కాలేదు. కానీ అంతకుముందే నటించిన 'ది ఫిల్మ్ స్టార్' అనే మలయాళ చిత్రం మాత్రం 2011లో విడుదలైంది. అప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పిన రంభ కెనడాలో నివసించే శ్రీలంక తమిళియన్ ఇంద్రన్ అనే పారిశ్రామికవేత్తను పెళ్ళి చేసుకొని ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. ఆ తర్వాత మధ్యలో తమిళ, తెలుగు టీవీ షోలలో కనిపించి సందడి చేసింది. తరుచూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది రంభ. తాజాగా ఈ ఏడాది ఓ తమిళ షో లో హోస్ట్‌గా చేస్తోంది.
కాగా ఇన్నాళ్లకు తిరిగి రంభ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్థం అయింది. పిల్లలు సైతం పెద్దవాళ్లు కావడం, ఆమె భర్త కూడా సమ్మతించడంతో ఆహార నియమాలు పాటిస్తూ స్లిమ్ అయ్యింది రంభ. తనకు నచ్చిన క్యారెక్టర్ లభించడంతో 49 యేళ్ళ రంభ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఆ సినిమా వివరాలు తెలియ జేయనున్నారు.