చిట్టిబాబు అండ్ ఫ్యామిలీ.. ఓటీటీకి వచ్చేశారు
ABN, Publish Date - Nov 27 , 2026 | 10:48 AM
ఎన్నో అంచనాల నడుమ థియేటర్లకు వచ్చి అటు వెంకటేశ్ ఇటు త్రివిక్రమ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
వెంకటేశ్ (Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌కు తెలుగు నాట క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కలయికలో గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే అప్పట్లో త్రివిక్రమ్ రచయితగా మాత్రమే పనిచేశారు. తొలిసారి ఆయన దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన సినిమా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam House No: 47 - AK47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ దశనుంచి విడుదల తేదీల వరకు వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు ఆక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లకు వచ్చి అటు వెంకటేశ్ ఇటు త్రివిక్రమ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథేంటంటే: చిట్టిబాబు (వెంకటేశ్) ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), పిల్లల బాధ్యతలు, అప్పులతో సతమతమవుతుంటాడు. ఇలాంటి సమయంలో ఉద్యోగం కూడా పోతుంది. అదే సమయంలో అతను కొన్న లాటరీ టికెట్‌కు రూ.100 కోట్ల బహుమతి వస్తుంది. దీంతో వారి జీవనశైలి ఒక్కసారిగా మారిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ డబ్బుపై కన్నేసిన ఓ బీహారీ దోపిడీ ముఠా చిట్టిబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. లాటరీ సొమ్ము ఇంటికి వచ్చిన రాత్రి దాడికి దిగిన ఆరుగురు దుండగులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతారు. అసలు చిట్టిబాబు కుటుంబం నేపథ్యమేంటి? దోపిడీ ముఠా వెనుక ఉన్న బృహస్పతి (రావు రమేశ్) వ్యూహం ఏమిటి? పోలీస్ అధికారి దామోదర్ నాయుడు (నారా రోహిత్) (Nara Rohith) ఈ కేసును ఎలా ఛేదించాడు? అన్నది మిగతా కథ.
అయితే.. ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్, ఏకే 47 అనే ట్యాగ్‌లైన్‌తోనే ఇది సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదని అర్థమవుతుంది. త్రివిక్రమ్ ఈ కథను ‘కర్మ రిటర్న్స్’ అనే పాయింట్ చుట్టూ నడిపించినప్పటికీ ఓ మధ్యతరగతి కుటుంబం దోపిడీ ముఠాను ఎదుర్కొనే విధానం ఆసక్తికరంగా ఉండదు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొడుతుంది. ఎడిటింగ్ లోపం, సంగీతం ముఖ్యంగా నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) పాత్ర తనతో వచ్చే మాల సాంగ్ సినిమాకు మైనస్. హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), పిల్లలుగా నటించిన యువినా, రాజ్ ప్రజ్వల్ బాగా చేశారు. సత్య కామెడీ మేజర్ హైలెట్. వెంకీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, త్రివిక్రమ్ మార్క్ మాటల కోసం ఓసారి చూడొచ్చు. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇతర బాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన వారు, వెంకీ, గురుజీ ఫ్యాన్స్ ఓ లుక్ వేయవచ్చు. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడే తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో ఇప్పుడు ట్రోలింగ్ అంతకుమించి అనే స్థాయిలో ఉంటుందేమోనని పలువురు బావిస్తున్నారు.