Varsha Bollamma: 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 3 కూడా ఉండాలి...
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:16 PM
ఈటీవీ విన్ లో ప్రసారమైన వర్ష బొల్లమ్మ 'కానిస్టేబుల్ కనకం'కు మంచి ఆదరణ లభించింది. దాంతో ఇప్పుడు జనవరి 8 నుండి సీజన్ 2ను కూడా ప్రసారం చేయబోతున్నారు.
నటి వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' (Constable Kanakam). పలు వివాదాలతో ప్రసారం అయిన ఈ వెబ్ సీరీస్ కు మంచి ఆదరణే లభించింది. దాంతో ఇప్పుడు సీజన్ 2ను రూపొందించి, ఈ నెల 8 నుండి ఈటీవీ విన్ (ETV Win) లో ప్రసారం చేయబోతున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ లో మేఘ లేఖ, రాజీవ్ కనకాల (Rajeev Kanakala), శ్రీనివాస్ అవసరాల (Srinivasarao Avasarala) కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ దీన్ని నిర్మించారు.
'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2 ప్రీ స్టీమింగ్ ఈవెంట్ లో నాయిక వర్ష బొలమ్మ మాట్లాడుతూ, 'కానిస్టేబుల్ కనకం నాకు చాలా ప్రత్యేకం. ఇంత అద్భుతమైన ఎమోషన్ ఉన్న స్టోరీకి నన్ను ఎంపిక చేసినందుకు డైరెక్టర్ ప్రశాంత్ కి థాంక్యూ. సీజన్ 3 కూడా చేయాలని కోరుకుంటున్నాను. సాయిబాబా గారు, హేమంత్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు ఈటీవీ విన్ సబ్స్క్రైబ్ చేయమని అడిగే వాళ్ళం. కానీ ఈరోజు అందరి ఇంట్లో ఈటీవీ విన్ ఉంది. అది ఇది గొప్ప సక్సెస్ గా భావిస్తున్నాను. మేఘలేఖ పర్ఫామెన్స్ ఈ సీజన్లో అదిరిపోతుంది. సురేష్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. చంద్రిక ఎక్కడ? అని అందరూ అడుగుతున్నారు. నేను సహస్ర ఎవరు? అని అడుగుతున్నాను' అని అన్నారు.
ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ, 'చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో కనకం ప్రయాణం మొదలైంది. సీజన్ 2 ఆయన సినిమా థియేటర్ కి రావడంతో పాటు ముగుస్తుంది. క్రికెట్ లో ఒక ఓవర్ లో ఆరు బంతులు ఉంటాయి. 'అనగనగా, ఎయిర్, కానిస్టేబుల్ కనకం, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్.. ఇలా ఐదు బౌండరీలు అయ్యాయి. ఇప్పుడు 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2 కూడా బౌండరీ కాబోతోంది. సంక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థియేటర్స్ లో ఆ సినిమాలు చూసిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి మా కంటెంట్ ని చూడాలని ఆశిస్తున్నాం' అని చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ, 'చంద్రిక ఎక్కడ అనే ప్రశ్నకు ఈ సీజన్ లో సమాధానం లభిస్తుంద'ని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సాయిబాబా, హేమంత్ తో పాటు నటి మేఘ లేఖ, సాయికృష్ణ, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి మాట్లాడారు.