Vadhandhi 2: ఏం సిరీస్ రా మావా.. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కి మెంటలొచ్చేస్తుంది

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:52 PM

నాలుగేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని సీజన్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నటుడు ఎస్.జె. సూర్య పోలీస్ ఆఫీసర్ వివేక్ పాత్రలో చూపించిన పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

vadhandhi Season 2

నాలుగేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని సీజన్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నటుడు ఎస్.జె. సూర్య పోలీస్ ఆఫీసర్ వివేక్ పాత్రలో చూపించిన పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సీజన్ సాధించిన ఘనవిజయంతో, అదే కాంబినేషన్‌లో పుష్కర్-గాయత్రి నిర్మాణంలో ఆండ్రూ విసెంట్ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి. అయితే ఈ రెండో సీజన్‌లో ఎస్.జె. సూర్య స్థానంలో వర్సటైల్ యాక్టర్ శశికుమార్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌ ఎలా ఉంది.. ? కథేంటి.. ? అనేది తెలుసుకుందాం.


ఈ సీజన్ 2 కథ విషయానికి వస్తే.. మధురైలో ఎనిమిది లేన్ల రహదారి ప్రారంభోత్సవ సమయంలో జరిగిన జేసీబీ తవ్వకాలలో రెండు అస్థిపంజరాలు బయటపడతాయి. దీంతో రాజకీయ ప్రకంపనలు, పోలీసు విచారణ మొదలవుతుంది. పడంబత్తూర్ పోలీస్ స్టేషన్ కి ఎస్.ఐ. మూసా రజా (శశికుమార్) పనిష్మెంట్ పోస్టింగ్ కింద వస్తాడు. ఇక అతని ప్రతిభ, నిజాయితీ తెలుసుకున్న ఎస్.పి. రతిక నాయర్ (అనఘ) ఈ కేసును మూసాకి అప్పగిస్తుంది. ఆ అస్థిపంజరం నుంచి మొదలైన కేసు ఇన్వెస్టిగేషన్.. చెల్లిని, ప్రియురాలిని చంపిన నేరంలో జైలు శిక్ష అనుభవిస్తున్న మణి (యశ్వంత్) వద్ద ఆగుతోంది. అసలు మణి ఎవరు.. ? ప్రియురాలు, చెల్లిని నిజంగానే అతడు హత్య చేశాడా..? మధ్యలో కేసులోకి సీరియల్ కిల్లర్ ఎందుకు వచ్చాడు..? చివరికి ఈ కేసును మూసా ఛేదించాడా.. ? లేదా.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.


సాధారణంగా పోలీసులు చాలా రఫ్ గా ఉంటారు. కేసు ఇన్వెస్టిగేషన్ లో కొంచెం కూడా జాలి చూపించరు. కానీ, మూసా పద్దతి వేరు. తాను నమ్మింది కచ్చితంగా జరుగుతుంది అని నమ్మేవాడు. మణి విషయంలో కూడా అతడు నిందితుడు కాదు అని నమ్మి విచారణ మొదలుపెడతాడు. సిరీస్ మొదటి మూడు ఎపిసోడ్స్.. ఆ అస్థిపంజరాలు ఎవరివి.. ? అని కనుక్కోవడంలోనే సరిపోతుంది. ఆ తరువాత ఎప్పుడైతే అస్థిపంజరాలు మణి చెల్లి, ప్రియురాలివి అని తెలుస్తోంది అప్పటి నుంచి సిరీస్ లో వేగం పుంజుకుంటుంది. ఇక ఇన్వెస్టిగేషన్ లో మూసా ఆలోచించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు కేసు ముగిసిపోయింది అనుకొనేలోపు మరో నిందితుడు మీద అనుమానం పుట్టించడం వలన ఒక్క ఎపిసోడ్ ని కూడా వదలకుండా చూడాలనే క్యూరియాసిటీని దర్శకుడు ప్రేక్షకుల్లో కలిగించాడు.


ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్‌ ఒక బలమైన క్లిఫ్‌హ్యాంజర్‌తో ముగుస్తూ ప్రేక్షకుడిలో ఉత్కంఠను నిలుపుతుంది. ప్రత్యేకంగా 7వ ఎపిసోడ్‌లో వచ్చే ఒక ఊహించని మలుపు విచారణను పూర్తిగా కొత్త కోణంలోకి తీసుకెళ్తుంది. చివరి రెండు ఎపిసోడ్లు కులాంతర ప్రేమ-గౌరవ హత్యల సాధారణ ఫార్ములా అనుకున్న కథను ఊహించని మలుపు తిప్పి, ఈ సిరీస్‌కు వదంతి అనే పేరు ఎందుకు పెట్టారో మరోసారి రుజువు చేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించడం, ఈ హత్యలు చేసింది ఎవరో తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు అంటే అతిశయోక్తి లేదు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఇప్పటివరకు చూస్తున్న ప్రేక్షకుడి మైండ్ బ్లాక్ అవుతుంది.


ఇక నటీనటుల గురించి చెప్పాలంటే.. సిరీస్ కి హైలైట్ అంటే మణి అనే చెప్పొచ్చు. జల్లికట్టు విన్నర్ గా.. చెల్లిని ప్రేమించే అన్నగా అతని నటన నెక్స్ట్ లెవెల్. ఎస్.ఐ. ముసా రజాగా శశికుమార్ తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన, ఎంతో అణచివేతతో కూడిన నిగ్రహమైన నటనను కనబరిచారు. ఒక వైపు కేసు తీవ్రత, మరోవైపు గర్భవతి అయిన భార్య సుమయ (అపర్ణా దాస్)తో ఆయన బంధం, పోలీస్ పాత్రలకు సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. సుమయ పాత్రను మూస ధోరణిలో కాకుండా చాలా పరిణతి చెందిన భార్యగా చూపించడం కథనానికి బలాన్నిచ్చింది. ఇక ఎస్.పి. రతిక నాయర్ గా అనఘ చాలా సెటిల్డ్ గా కనిపించింది. తిరునెల్వేలి యాసలో కామెడీ టైమింగ్‌తో ఎస్.ఐ. రామార్‌గా వివేక్ ప్రసన్న మళ్లీ ఆకట్టుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణుడిగా చేతన్, టీ సరఫరా చేసే కుర్రాడి నుంచి యూట్యూబర్‌గా మారే పాత్రల వరకు చిన్న చిన్న క్యారెక్టర్లను కూడా రచయిత ఆండ్రూ లూయిస్ చాలా నమ్మశక్యంగా తీర్చిదిద్దాడు.


8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో మొదటి 4 ఎపిసోడ్స్ కొద్దిగా లాగ్ ఉండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక మూసా పాత్ర కూడా చాలా నెమ్మదిగా ఉండడం వలన పోలీస్ అధికారి అనే భావన కలగదు. మొదటి సీజన్ లో సూర్యని మెప్పించలేకపోయినా.. శశికుమార్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. సీజన్ 1 ట్విస్ట్ కంటే ఎక్కువ సీజన్ 2 ట్విస్ట్ మరింత బలంగా ఉండడంతో ప్రేక్షకులకు ఒక మంచి సిరీస్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది. మొత్తంగా, మొదటి సీజన్ స్థాయిలోనూ, కొన్ని అంశాల్లో అంతకంటే బెటర్‌గానూ రూపుదిద్దుకున్న వదంతి 2: ది మిస్టరీ ఆఫ్ మణి మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ వీకెండ్ బింజ్-వాచ్ సిరీస్.

Updated Date - Aug 08 , 2026 | 07:50 PM