The Last House: ఇంట్లోనే బంధీలు.. బయట అడుగుపెడితే సర్వనాశనమే
ABN, Publish Date - Aug 09 , 2026 | 08:14 PM
ఈమధ్య నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వినూత్నమైన కాన్సెప్ట్‌లు, ఊహకందని ట్విస్టులు, ఉత్కంఠభరితమైన సర్వైవల్ కథాంశాలతో రూపొందే కంటెంట్‌కు ప్రస్తుతం ఓటీటీ ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
ఈమధ్య నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వినూత్నమైన కాన్సెప్ట్‌లు, ఊహకందని ట్విస్టులు, ఉత్కంఠభరితమైన సర్వైవల్ కథాంశాలతో రూపొందే కంటెంట్‌కు ప్రస్తుతం ఓటీటీ ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్, హారర్ జానర్లలో నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చే ఒరిజినల్ ప్రొడక్షన్స్‌పై ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. ఆ సిరీస్ లోకి తాజాగా చేరిన మరో డిఫరెంట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీయే ది లాస్ట్ హౌస్ (The Last House). గ్రేటా లీ, వాగ్నర్ మౌరా జంటగా లూయీస్ లెటెరియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం.
కథ ఏంటంటే.. జేసన్ ఒక ఇంజనీర్ . తన భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తుంటాడు. ఒక రోజు తమ ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా బయట వింత వర్షం పడుతుంది. ఆ వర్షం తగ్గగానే ఊహించని విధంగా ఆ ఇంటి తలుపులు, కిటికీలు శాశ్వతంగా లాక్ అయిపోతాయి. ఎలాంటి శక్తిని ఉపయోగించినా బయటకు వెళ్లే దారి దొరకదు. ఫోన్ నెట్‌వర్క్స్, ఇంటర్నెట్ బంధాలు అన్నీ తెగిపోతాయి. బయట చూస్తే అందరి పరిస్థితి ఇంతే అని తెలుస్తోంది. పక్క ఇళ్లలోని వారితో కేవలం గాజు కిటికీల కాగితాలపై రాసిన నోట్స్ ద్వారా మాత్రమే సంభాషించాల్సి వస్తుంది. బయట ఏదో తెలియని భయానక వింత జీవులు తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న ఆహారం, నీరు అయిపోతుండటంతో ఆ కుటుంబం చావుబతుకుల మధ్య ఉంటుంది. అయినా కూడా ఒకటి, రెండు కాదు దాదాపు ఐదేళ్లు ఆ కుటుంబం బతుకుతుంది. ప్రపంచంలో ఉన్న చివరి ఇంట్లో ఆ కుటుంబం చావుబతుకుల మధ్య ఎలా పోరాడింది? అసలు ఆ వింత వర్షం వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ ఇల్లు ఎందుకు లాక్ అయింది? చివరికి వాళ్లు ఆ ఇంటి నుంచి బయటపడగలిగారా లేదా అనేదే ది లాస్ట్ హౌస్ కథ.
దర్శకుడు లూయీస్ లెటెరియర్ తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన సొంత ఇంట్లోనే బంధీ అయిపోతే.. బయట ఏదో విపత్తు పొంచి ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే పాయింట్‌తో ప్రేక్షకుల్లో మొదటి సన్నివేశం నుంచే తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తించారు. భయం, నిస్సహాయత, కుటుంబ మనుగడ కోసం ఆ ఇంటి పెద్ద ఏం చేశాడు.. ? అనే అంశాల చుట్టూ ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. నటులు వాగ్నర్ మౌరా, గ్రేటా లీ తమ పాత్రల్లో జీవించారు. ఇద్దరు పిల్లలు కూడా వారి వారి పాత్రల్లో అద్బుతంగా నటించారు.
అయితే, ప్రారంభంలో ఉన్నంత ఉత్కంఠ సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి సడలుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు చాలా హడావుడిగా, కొన్ని అతుకుల బొంత సీన్లతో ముగుస్తాయి. బయట ఉన్న వింత జీవుల డిజైన్, కొన్ని సీన్లలో విఎఫ్‌ఎక్స్ అనుకున్నంత భయాన్ని కలిగించలేకపోయాయి. స్క్రీన్‌ప్లేలో కొన్ని లాజిక్ లేని నిర్ణయాలు ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తాయి. అసలు ఆ జీవులు ఎందుకు వచ్చాయి.. ? వాటి ఉద్దేశ్యం ఏంటి.. ? ఈ ఇంటికే ఎందుకు వచ్చాయి.. ? అనేవి ఏమి దర్శకుడు చూపించలేదు. ఈ ఇల్లు మనదే కాదు.. వారిది కూడా అనే ఒక్క డైలాగ్ చెప్పి స్వస్తి చెప్పాడు. మొత్తానికి ది లాస్ట్ హౌస్ ఒక భిన్నమైన ప్లాట్‌తో మొదలై, మంచి థ్రిల్‌ను పంచినప్పటికీ.. వీక్ క్లైమాక్స్ వల్ల సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. సైన్స్ ఫిక్షన్, సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఒకసారి చూసేయవచ్చు.