పల్లెటూరి జనాలకు సెక్స్ ఎడ్యుకేషన్.. సూపర్ సుబ్బు ఎలా ఉందంటే

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:39 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), మిథిలా పాల్కర్ జంటగా నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మొదటి టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు (Super Subbu).

Sundeep Kishan

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), మిథిలా పాల్కర్ జంటగా నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మొదటి టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు (Super Subbu). డీజే టిల్లు స్క్వేర్ తో హిట్ అందుకున్న దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సిరీస్‌ను తెరకెక్కించాడు. ఈ కామెడీ డ్రామా భారీ ప్రమోషన్ల నడుమ జులై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్నేళ్లుగా సందీప్ కి ఒక మంచి హిట్ లేదు. ఈ సూపర్ సుబ్బు అయినా సందీప్ ని కాపాడిందా.. ? లేదా.. ? అనేది చూద్దాం.


కుక్కుటేశ్వరరావు చిలుకూరి (మురళీ శర్మ) చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్. అతడి కొడుకు సుబ్రహ్మణ్యం చిలుకూరి అలియాస్ సుబ్బు(సందీప్ కిషన్). చిన్నతనం నుంచి సుబ్బు కామానికి బానిస అవుతున్నాడని నమ్మి భయంతో పెంచుతాడు. కొడుకు అప్రయోజకుడు అని స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పించి.. జాబ్ పర్మినెంట్ చేయించుకోవాలని, అలా అయితేనే దివ్య (మానస చౌదరి)తో పెళ్లి చేస్తానని చెప్తాడు. దీంతో సుబ్బు.. ఏదో ఒకలా జాబ్ పర్మినెంట్ కావడానికి చూస్తూ ఉంటాడు. ఈలోపు మాకీపూర్ అనే గ్రామంలో సంతానోత్పత్తి ఎక్కువగా ఉండడంతో అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు జరపాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ, ఆ పాఠాలు చెప్పడానికి వెళ్ళిన టీచర్ ని చదువురాని గ్రామస్తులు కొట్టి తరిమేస్తారు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్.. ఆ టీచర్ పోస్ట్ కి నువ్వు వెళితే.. జాబ్ పర్మినెంట్ చేయిస్తానని సుబ్బును నమ్మించి మాకీపూర్ కి పంపిస్తాడు. అక్కడ సుబ్బు ఎన్ని కష్టాలు పడ్డాడు.. ? ఆ గ్రామస్తులకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాడా.. ? అసలు ఇలాంటి జాబ్ అంటేనే అసహ్యం ఉన్న తండ్రికి నిజం చెప్పాడా.. ? ఆ ఊర్లో పరిచయం అయిన స్వాతి ( మిథిలా పాల్కర్) ఎవరు.. ? చివరికి మాకీపూర్ లో ఏం జరిగింది.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.


సాధారణంగా ఇండియాలో సెక్స్ అనే పదం వింటేనే చాలామంది అదేదో పెద్ద బూతు అన్నట్లు చూస్తారు. కానీ, దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఈ సిరీస్ లో చూపించారు. సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ అంటే.. ఏదో బోల్డ్ కంటెంట్ ఉంటుంది.. అని అనుకుంటారు. కానీ, ఈ సిరీస్ లో అలాంటిదేమీ ఉండదు. చెప్పాలనుకున్న కథను మల్లిక్ రామ్ చాలా స్పష్టంగా చెప్పాడు. దానికి తండ్రీకొడుకుల ఎమోషన్ ని యాడ్ చేయడంతో సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అయ్యింది. మొత్తం ఏడు ఎపిసోడ్లతో, ఒక్కోటి సుమారు 40 నిమిషాల నిడివితో ఉంటుంది. కాకపోతే సిరీస్ కావడంతో చాలా స్లోగా వెళ్తున్నట్లు ఉంటుంది. ముందు 2 ఎపిసోడ్స్ అయితే.. అసలు ఎందుకు పెట్టారు అన్నట్లు ఉంటుంది. అందులో సుబ్బును తండ్రి ఎందుకు అసహ్యించుకున్నాడు అనేది చూపించినా.. ఇంకొంచెం బలం ఉండేలా సీన్స్ ని రాసుకుంటే బావుండేదనిపిస్తుంది. సుబ్బు తప్పులేకపోయినా.. తండ్రి.. కొడుకుదే తప్పు అని నమ్మడం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోదు.


బ్రహ్మానందం, గెటప్ శీను, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది లాంటి పాపురల్ ఆర్టిస్టులు కూడా కామెడీని ఎక్కువ పండించలేకపోయారు. వారు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్స్ లోనే కనిపించారు. ఇక విలన్ గా జీవన్ కనిపించాడు. మొదటి నుంచి ఆయనను కమెడియన్ గా చూసినవారు.. అంత సీరియస్ పాత్రలో ఊహించుకోలేరు. ఇక గ్రామాలలో ఆడవారు పడే బాధలు, సేఫ్టీ పాడ్స్ ఎలా వాడాలి అని నేర్పించే సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. అందరికీ జన్మనిచ్చిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గు ఎందుకు అమ్మా అని సందీప్ చెప్పే డైలాగ్ అదిరిపోతుంది. ఇక సందీప్ తరువాత మిథిలా పాత్ర కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఆడపిల్ల తీసుకొనే ఏ నిర్ణయం వెనుక అయినా మగాడు ఎందుకు ఉండాలి? అన్నది ఆమె ప్రశ్న. తన డ్రీమ్ ని నెరవేర్చుకోలేకపోయిన అమ్మాయిగా చాలా అద్బుతంగా నటించింది. ఇక తన స్వార్ధం కోసం పెళ్లిని వాడుకొనే అమ్మాయిగా మానస.. హీరో తండ్రిగా మురళీ శర్మ చక్కగా నటించారు. సిరీస్ అంతా సందీప్ చాలా నీరసంగా కనిపించడం పెద్ద మైనస్. కాకపోతే ఆ పాత్రను బట్టి అలా ఉండాలి అని సిరీస్ చూసినవారికి తెలుస్తుంది. కొద్దిగా ల్యాగ్ ఉన్నా వీకెండ్ కి కుటుంబం మొత్తం కలిసి సూపర్ సుబ్బుని వీక్షించవచ్చు.

ఇవి కూడా చదవండి:

Nagabandham Review: నాగ‌బంధం.. సినిమా రివ్యూ

Rao Bahadur Reveiw: ‘రావు బహదూర్’ రివ్యూ


Updated Date - Jul 03 , 2026 | 06:45 PM