Shivaji: శివాజీ.. ఇలా చేశాడేంటి! కొత్త సినిమా.. డైరెక్ట్ ఓటీటీకి
ABN , Publish Date - Jan 31 , 2026 | 07:22 PM
శివాజీ హీరోగా నటించి, నిర్మించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం కాబోతోంది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో శివాజీ సరసన లయ హీరోయిన్ గా నటించింది.
వింటేజ్ సక్సెస్ ఫుల్ పెయిర్ హీరో శివాజీ (Shivaji), హీరోయిన్ లయ (Laya) జంటగా నటిస్తున్న చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వం వహించారు. నైంటీస్ వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్ తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, థర్టీ ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్, కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డేట్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ శివాజీ మాట్లాడుతూ, 'సుధీర్ కొత్త దర్శకుడు అయినప్పటికీ కథను చాలా అద్భుతంగా చెప్పాడు. అతనికి నచ్చిన టీం తోనే ఈ సినిమా చేసాం. ఈ సినిమాలో చాలా పాపులర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా కూర్చుని ఒక సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ చాలా పాషన్ తో పనిచేశారు. ప్రిన్స్ బెస్ట్ యాక్టర్. ఈ సినిమా ద్వారా తను ఇంకో రకమైన షేడ్ లో చూస్తారు. లయ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అద్భుతంగా సపోర్ట్ చేసింది. మంచి హిట్ సినిమా అవ్వాలని చాలా కష్టపడింది. బండ్ల గణేష్ నా బ్రదర్ లాంటివారు. ఆయన పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది. ఈ సినిమాలో మంచి సాంగ్ చేశారు. అది చాలా హెల్ప్ అయ్యింది. రంజిన్ రాజ్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రోహన్ గాడ్ గిఫ్ట్ యాక్టర్. అరకు, కొండవీడు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. అక్కడ పోలీసులు ఎంతో సహకరించారు' అని అన్నారు. లయ మాట్లాడుతూ, 'మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా... ఇలా ఎన్నో డిఫరెంట్ సినిమాలు శివాజీ గారు, నేను చేశాం. 'మిస్సమ్మ' తో అందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నన్ను రత్నమాలగా గుర్తు పెట్టుకున్నారు. ఇక నుంచి ఉత్తరని గుర్తు పెట్టుకుంటారు. ఉత్తర నా కెరియర్ లో చాలా స్పెషల్ క్యారెక్టర్ అవుతుంది. ఈటీవీలో 90s చేయాల్సింది. మిస్సయ్యాను. ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. శివాజీ గారికి సినిమా అంటే చాలా పాషన్ ఈ సినిమా కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన వరుస విజయాలతో ఉన్నారు' అని అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ, 'ఇదో మంచి క్రైమ్ కామెడీ. చాలా రోజుల తర్వాత ఈ జానర్ లో సినిమా వస్తోంది. అలాగే మోస్ట్ అవైటెడ్ పెయిర్ శివాజీ గారు, లయ గారు కలిసి నటించిన సినిమా. మా గత చిత్రాలు ఎలా అయితే మిమ్మల్ని అలరించాయో ఈ సినిమా కూడా మిమ్మల్ని అలరిస్తుంది. అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ, 'శివాజీ గారు నా ఫస్ట్ హీరో, ప్రొడ్యూసర్. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇందులోని సాంగ్ విషయంలో కూడా శివాజీ గారికి థాంక్స్ చెప్పాలి. ఆ సాంగ్ యాడ్ చేసిన తర్వాత సినిమా మరింత అద్భుతంగా కనిపించింది. ఆ సాంగ్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. లయ గారి ఉత్తర పాత్ర గుర్తుండిపోతుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రిన్స్, సింగర్ భోలే షావలి, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ మాట్లాడారు.