Second Case of Seetharam: ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు.. ఏం సినిమారా బాబు
ABN, Publish Date - Aug 01 , 2026 | 03:34 PM
ఈమధ్యకాలంలో సినీ ప్రియులు థ్రిల్లర్, సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ కథలపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రిప్పింగ్ ప్లాట్‌తో వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలలోనూ సంచలన విజయాలను అందుకుంటున్నాయి.
ఈమధ్యకాలంలో సినీ ప్రియులు థ్రిల్లర్, సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ కథలపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రిప్పింగ్ ప్లాట్‌తో వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలలోనూ సంచలన విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గతంలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సీతారాం బెనోయ్: కేస్ నంబర్ 18 చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న చిత్రం సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం (Second Case of Seetharam). దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రాఘవేంద్ర (Vijay Raghavendra) మరోసారి ఇన్స్పెక్టర్ సీతారాంగా పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమజాన్ ప్రైమ్ వీడియోలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. మొన్నటివరకు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికొస్తే.. మొదటి కేసులోనే భార్యను పోగొట్టుకొని ఒంటరిగా జీవిస్తుంటాడు సీతారాం(విజయ్ రాఘవేంద్ర). చిన్నతనంలోనే అక్క కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడంతో వారి జ్ఞాపకాల్లోనే బారుకుతూ ఉంటాడు. ఆ సమయంలోనే శివమొగ్గ జిల్లాలోని ఆనేగడ్డె ప్రాంతంలో నడివయస్సు ఉన్న వ్యక్తులను వరుసగా హత్యకు గురవుతూ ఉంటారు. ఆ హత్యలను ఒక సైకోపాత్ చేస్తున్నట్లు తెలుసుకుంటారు. ఈ కేసు సీతారాంకు కత్తి మీద సాములా తయారవుతుంది. అసలు వయస్సు పైబడిన వారిని అంత కిరాతకంగా చంపుతున్న ఆ సైకో కిల్లర్ ఎవరు.. ? అతను అలా చంపడానికి మోటివ్ ఏంటి.. ? చివరకు ఆ సైకో కిల్లర్ ని సీతారాం పట్టుకున్నాడా.. ? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్రతి హత్య వెనుక ఒక మోటివ్ ఉంటుంది. ఎందుకు చంపుతున్నారు..? ఈ ప్రశ్ననే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. చిన్నతనం నుంచి మనసులో మెదిలే భావాలు, చీదరింపు, ప్రేమ దగ్గకపోతే సైకోలుగానే తయారవుతారు. ఇందులో హత్యలు చేసే వ్యక్తి సైకోగా మారడం వెనుక ఒక బలమైన కారణం చూపించి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా కమర్షియల్ హంగులకు పోకుండా, మోర్చ్యురీ డాక్టర్ ఇచ్చే క్లూస్ ఆధారంగా సాగే విచారణ సన్నివేశాలు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రియులను కట్టిపడేస్తాయి. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు.. హంతకుడు దొరికిపోయాడు అనుకొని ఊపిరి పీల్చుకోవడం ఆలస్యం ఇంకో ట్విస్ట్ బయటపడుతుంది. చివర్లో ఆ సైకో ఎవరో తెలిసి షాక్ అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు.
పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ రాఘవేంద్ర అందించిన సెటిల్డ్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, నవనీత్ శామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రథమార్థంలో కథ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు, విలన్ మైండ్ గేమ్‌లు సస్పెన్స్ లవర్స్‌ను మైమరపిస్తాయి. మొదటి భాగాన్ని మించేలా తెరకెక్కిన ఈ చిత్రం క్రైమ్ అండ్ థ్రిల్లర్ లవర్స్‌కు ఒక పర్ఫెక్ట్ వాచబుల్ ఆప్షన్‌గా నిలుస్తోంది.