Save The Tigers Review: సేవ్‌ ద టైగర్స్ 3 వెబ్ సీరిస్‌ రివ్యూ

ABN , Publish Date - Jun 21 , 2026 | 07:36 PM

మహి వి రాఘవ, ప్రదీప్‌ అద్వైతం క్రియేటర్స్ గా వ్యవహరించిన 'సేవ్ ద టైగర్స్ 3' వెబ్ సీరిస్‌ ప్రస్తుతం జియో హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్‌ ను శ్రీరామ్ డైరెక్ట్ చేశారు.

Save The Tigers 3

'సేవ్‌ ద టైగర్స్' (Save The Tigers 3) వెబ్ సీరిస్‌ సీజన్‌ వన్ మూడేళ్ళ క్రితం జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్‌ అయ్యింది. ఆర్గానిక్ కామెడీతో ఫస్ట్ సీజన్‌ వ్యూవర్స్ ను విశేషంగా మెప్పించింది. దాంతో క్రియేటర్స్ మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం ఆ తర్వాత సంవత్సరమే 'సేవ్ ద టైగర్స్' సీజన్‌ 2 ను జనం ముందుకు తీసుకొచ్చారు. మొదటి సీజన్‌కు తేజ కాకుమాను దర్శకుడిగా వ్యవహరిస్తే, రెండో సీజన్‌కు అరుణ్‌ కొత్తపల్లికి అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు రెండేళ్ళ తర్వాత 'సేవ్‌ ద టైగర్స్' సీజన్ 3ని శ్రీరాం ఇరగంరెడ్డి చేతిలో పెట్టారు. సో... వినోద ప్రధానమైన వెబ్ సీరిస్ గా పేరు తెచ్చుకున్న 'సేవ్‌ ద టైగర్స్' సీజన్ 3 ఎలా ఉందో తెలుసుకుందాం.

కొద్ది రోజుల క్రితం 'సేవ్ ద టైగర్స్ 3'కి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగానే... ఈసారి మేకర్స్ సోషియో ఫాంటసీ జానర్‌లో వినోదాన్ని పండించబోతున్నారనేది అర్థమైంది. దానికి తగ్గట్టుగానే ఈ సీజన్ 3 సాగింది. గంటా రవి (ప్రియదర్శి (Priyadarshi), రాహుల్‌ (అభినవ్ గోమఠం Abhinav Gomatham), విక్రమ్‌ (చైతన్య కృష్ణ Chaitanya Krishna) ముగ్గురూ జీవితంలో క్లిష్టమైన దశకు చేరుకుంటారు. ఎమ్మెల్యే కాలేకపోయాననే ఫస్ట్రేషన్‌లో రవి ఉంటే, జాబ్‌ పోగొట్టుకున్న విషయం భార్యకు చెప్పలేక రాహుల్‌ సతమతమౌతుంటాడు. ఇక విక్రమ్ ప్రవర్తన నచ్చక భార్య అతనికి విడాకులు ఇవ్వడానికి సిద్థమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 'మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్' అనే నానుడి గుర్తుకు వచ్చి, ఈ ముగ్గురూ స్వర్గంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిశోర్‌)ని తిట్టడం మొదలెడతారు. దాంతో చిరాకు పడ్డ ఇంద్రుడు ఈ సమస్యను పరిష్కరించే పనిని గుప్తా (గుండు సుదర్శన్‌)కు, జూ. గుప్తా (అభయ్‌)లకు అప్పగిస్తాడు. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే సత్యం తెలిసి గుప్తా, మొదటి ప్రపంచంలో ఉన్న ఈ ముగ్గురి స్థానంలోకి... వీరిలానే రెండో ప్రపంచంలో ఉన్న ముగ్గురిని స్వైప్ చేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.


నిజానికి రెండో ప్రపంచంలో ఉన్న రవి, రాహుల్‌, విక్రమ్ నీచ్‌, కమీనే, కుత్తే లాంటి వాళ్ళు. వారి విపరీత చేష్టల కారణంగా తీవ్రమైన సమస్యల్లో కూరుకుపోయి, ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో గుప్తా వారిని మొదటి ప్రపంచంలోకి తీసుకు వెళుతున్నాననే సరికీ ఆనంద పడతారు. అలానే సంసార జంఝాటంతో సతమతమౌతున్న మొదటి ప్రపంచంలోని రవి, రాహుల్‌, విక్రమ్ కూడా ఈ స్వైప్‌కు సరే అంటారు. కానీ ఒకరి పాత్రల్లోకి ఒకరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? తమ జీవిత భాగస్వాముల కష్టాలను అర్థం చేసుకోవడానికి ఈ స్వైపింగ్‌ సిస్టమ్‌ ఎలా ఉపయోగపడింది? తద్వారా వారిలో ఎలాంటి మార్పు వచ్చింది? అనేది సీజన్‌ 3లోని ప్రధానాంశం.

మొదటి రెండు సీజన్స్ తో పోల్చితే... ఇందులో వినోదం పాలు కాస్తంత తక్కువే. అయితే హీరోలుగా నటించిన ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణకు మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకటికి రెండు పాత్రలు చేయడమే కాకుండా... దాదాపు ఒకేలా ఉండే వేషధారణ కావడంతో, వ్యూవర్స్ కన్ ఫ్యూజన్ కు గురి కాకుండా ఉండటానికి బాగానే కృషి చేశారు. ఇది ఫాంటసీ జానర్ కావడంతో లాజిక్కుల జోలుకి పోవాల్సిన పనిలేదు. మొదటి నాలుగైదు ఎపిసోడ్స్ సాదా సీదాగా సాగినా... చివరికి వచ్చే సరికీ మహిళా సాధికారికతకు ప్రాధాన్యమిస్తూ గౌరవప్రదంగా దీనిని ముగించారు. హీరోయిన్లుగా నటించిన జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ సైతం ద్వి పాత్రలు చేసినా... వాళ్ళు ఒకరితో ఒకరు కలిసే ఆస్కారం లేకపోవడంతో సులువైంది. క్లయిమాక్స్ లో రోహిణితో చేయించిన ఫైట్స్ అలరిస్తాయి. ఇతర ప్రధాన పాత్రలను వెన్నెల కిశోర్, గుండు సుదర్శన్, అభయ్‌, గంగవ్వ, మిర్చి కిరణ్, ఆర్.కె., ముక్కు అవినాశ్‌, శ్రీకాంత్‌ భరత్‌, ఝాన్సీ, జయశ్రీ రాచకొండ, రాజశ్రీ నాయర్‌, హర్షవర్థన్, సునయన తదితరులు పోషించారు. శివ మేక, సాహితి చింతలపూడి భారీగానే ఈ వెబ్ సీరిస్‌ ను నిర్మించారు. ఎక్కడా కన్ ఫ్యూజన్‌ లేకుండా శ్రీరామ్‌ దీన్ని తెరకెక్కించడం విశేషం. మొదటి రెండు సీజన్స్ స్థాయిలో వినోదం లేదు కాబట్టి... పనికట్టుకుని కాకపోయినా... సరదాగా టైమ్ పాస్ కోసం ఓసారి చూడొచ్చు.

రేటింగ్‌: 2.75/ 5

ట్యాగ్‌ లైన్‌: 'ఇంద్ర' జాలం!

ఇవి కూడా చదవండి:

ధనుష్, మృణాల్ ఠాకూర్ విడిపోయారా? అసలు నిజం ఏంటి!

అప్పుడు తిట్టాడు.. ఇప్పుడు కౌగిలించుకున్నాడు

రామ్ - భాగ్యశ్రీ ప్రేమాయణం నిజమే.. ఇదిగో క్లారిటీ

Updated Date - Jun 21 , 2026 | 07:39 PM