ఓటీటీకి వచ్చేసిన.. అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్స్
ABN, Publish Date - Apr 03 , 2026 | 08:45 AM
గత నెలలో థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న రెండు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.
గత నెలలో థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న రెండు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు శ్రీవిష్ణు (Sree Vishnu) మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యుంజయ్ (Mrithyunjay), శివాజీ డార్క్ కామెడీ, క్రైమ్ డ్రామా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని (Sampradayini Suppini Suddapoosani) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మార్చి 6నే థియేటర్లలో పోటీగా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలలో మృత్యుంజయ్ (Mrithyunjay) కాస్త డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించింది గానీ శివాజీ (Shivaji) చిత్రం నెగిటివ్ టాక్‌తో జనాలను థియేటర్లకు రప్పించలేక పోయింది.
క్రైమ్ రిపోర్టర్ కాలేకపోయిన మృత్యుంజయ్ ఓ మీడియా సంస్థలో అడ్వర్టైజ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు శ్రద్ధాంజలి ప్రకటన తీసుకు వచ్చే క్రమంలో ఓ కాలనీలో చనిపోయిన వ్యక్తి కూతురు ఎడవకుండా అలానే మౌనంగా ఉండడాన్ని గమనిస్తాడు. దాని వెనకాల దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలానే అక్కడ జరిగిన మరో మరణాన్ని చూసి ఇవి ఎవరో కావాలని చేస్తున్న హత్యలుగా నిర్థారణకు వస్తాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా అంతగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తనే స్వయంగా హంతకుడిని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే హీరో ఎప్పుడు ఏం చేసేది, చేస్తున్నది పసిగట్టిన విలన్ ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో... విలన్ ఆట ఎలా కట్టించాడనేదే స్టోరి.
ఇక సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీరామ్ హార్స్‌లీ హిల్స్ గ్రామ సచివాలయంలో పంచాయితీ అధికారిగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అవినీతి, లంచాలకు ఆమడ దూరం. కానీ ఇంట్లో భార్య ఎలాగైనా డబ్బు సంపాదించండని నిత్యం ఒత్తిడి చేస్తుంటుంది. ఓ రోజు లోకల్ ఎస్సైతో శ్రీరామ్ మధ్య గొడవ జరుగుతుంది. ఇది మనసులో పెట్టుకున్న ఎస్సై ఓరోజు శ్రీరామ్ ఇంట్లో లేని సమయంలో వచ్చి కుటుంబ సభ్యులను భయపెట్టాలని చూస్తాడు. ఆ సమయంలోనే శ్రీరామ్ కుమారుడు మిట్టు అల్లరిగా చేసిన పని వల్ల ఎస్సై అక్కడిక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. ఇంతలో ఇంటికి వచ్చిన శ్రీరామ్ ఎస్సై శవాన్ని చూసి షాకవుతాడు. జరిగింది చెప్పి పోలీసులకు లొంగిపోవాలనుకుంటాడు. కానీ భార్య అందుకు అంగీకరించదు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఆ శవాన్ని వదిలించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, వాటి పర్యవసానం ఏమిటీ అనేది మిగతా కథ.
చూడడానికి ఈ రెండూ క్రైమ్ జానర్ల సినిమాలే అయినప్పటికీ దర్శకులు ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాలు నడిపించారు. ఎక్కడ అసభ్యత, అశ్లీలత అనేవి లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చిత్రాలు రూపొందించారు. ఇందులో సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం మొదటి నుంచి ఈ టీవీ విన్ వారి సినిమానే అయినా ఆశ్చర్యకరంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇక మృత్యుంజయ్ చిత్రం సైతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సమ్మర్ హాలీడేస్‌లో ఇంటి పట్టున ఉండే వారికి ఈ సినిమాలు మంచి టైంపాస్.