సడన్ షాక్ ఇచ్చిన శివాజీ.. కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రద్దు
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:26 PM
శివాజీ, లయ జంటగా నటించిన 'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం లేదు. మార్చి మొదటివారంలో ఈ మూవీ థియేటర్లలోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది.
నటుడు శివాజీ (Shivaji), లయ (Laya) జంటగా నటించిన సినిమా 'సంప్రదాయని సుప్పిని సుద్దపూసని' (Sampradayini Suppini Suddapoosani). ఈ సినిమాను శివాజీనే ఈటీవీ విన్ టీమ్‌తో కలిసి నిర్మించారు. ఫిబ్రవరి 12న ఇది ఈటీవీ విన్‌లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ అలా జరగలేదు. శివాజీ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని శివాజీ నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. కాస్తంత సమయం తీసుకుని, మళ్ళీ భారీగా ప్రచారం చేసి, సినిమాను మార్చి మొదటివారంలో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ మధ్య ఈటీవీ విన్ (Etv Win) డైరెక్ట్ స్ట్రీమింగ్ కంటే థియేట్రికల్ రిలీజ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని సినిమాలను థియేట్రికల్ రిలీజ్ కోసమే నిర్మిస్తోంది. అలా వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai) సినిమా కూడా ముందు థియేటర్లలోనే విడుదలై, ఆ తర్వాత ఈటీవీ విన్‌లో ప్రసారమైంది. అలానే 'కానిస్టేబుల్ కనకం' అనే వెబ్ సీరిస్ రెండు భాగాలను ముందు స్ట్రీమింగ్ చేసిన ఈటీవీ విన్ సంస్థ ఇప్పుడు మూడో సీరిస్ పూర్తి అయిన తర్వాత ఈ మొత్తాన్ని థియేటర్లలో సినిమాగా రీ-ఎడిట్ చేసి రిలీజ్ చేయబోతోంది. ఇలా ఈటీవీ విన్ రకరకాల ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా 'సంప్రదాయని సుప్పిని సుద్దపూసని' సినిమాను కూడా తొలుత థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శివాజీ, లయ జంటగా నటించిన ఈ సినిమాలో రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రలను పోషించారు. సుధీర్ శ్రీరామ్ దీనికి దర్శకత్వం వహించగా, రంజిన్ రాజ్ సంగీతం అందించారు.