Resort web series: అనుగ్రహపై వేటు పడింది!
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:17 AM
రిసార్ట్ వెబ్ సీరిస్ మేకర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీనిధి పాత్రధారి అనుగ్రహ నంబియార్ ను మొత్తానికి ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రీనిధి ఎగ్జిట్ గురించి ఓ డైలాగ్ లో మేకర్స్ తేల్చిచెప్పేశారు.
వర్థమాన నటి అనుగ్రహ నంబియార్‌కు చివరకు అన్యాయమే జరిగింది. ఆమెను 'రిసార్ట్' వెబ్ సీరిస్ నుంచి మేకర్స్ తొలగించారు. తాజాగా ప్రసారమైన ఈ వెబ్ సీరిస్ ఎపిసోడ్స్ తో ఈ విషయం తేటతెల్లమైంది.
'రిసార్ట్' వెబ్ సీరిస్‌లో రూమ్ సర్వీస్ శ్రీనిధి పాత్రను అనుగ్రహ పోషించింది. మొదటి పది పదిహేను ఎపిసోడ్స్ లో ఆమె పాత్రను కీలకంగా చూపించారు. ఉప ప్రేమకథలో ఓ పావుగా శ్రీనిధి పాత్రను మేకర్స్ ఉపయోగించుకున్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఆమెది మరీ అంత ప్రధానమైన పాత్ర కాదు. కానీ ఆమెకు మాత్రం ఈ వెబ్ సీరిస్ లో కీలకమైన పాత్ర అని చెప్పి ఒప్పించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే... కొంత కాలం క్రితం అనుగ్రహ ఈ వెబ్ సీరిస్ మేకర్స్ మీద, దీనిలో కథానాయకుడిగా నటించి, స్క్రిప్ట్ ను అందిస్తున్న విజయ్ కుమార్ రాజేంద్రన్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది.
'రిసార్ట్' వెబ్ సీరిస్ లో నటించే సమయంలో మరెక్కడ నటించ కూడదని తనతో అగ్రిమెంట్ చేసుకున్నారని, అయితే తనకు ప్రాధాన్యం లేని పాత్రను ఇచ్చారని, ఒక్కోసారి షూటింగ్ స్పాట్‌కు రప్పించి కూడా తనపై ఎలాంటి సన్నివేశాలు తీసేవారు కాదని వాపోయింది. ఈ అగ్రిమెంట్ కారణంగా తన కెరీర్ గ్రాఫ్ తగ్గిపోయిందని, ఆర్థికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇలాగే జరిగితే ఇక ఆత్మహత్యే శరణ్యమని సోషల్ మీడియాలో పేర్కొంది.
ఆమె చేసిన ఆరోపణలకు విజయ్ కుమార్ , అతని భార్య నక్షత్ర కౌంటర్ ఇచ్చారు. అనుగ్రహను పోషించే శ్రీనిధి పాత్రను పెంచమని ఆమె కోరిందని, కానీ స్క్రిప్ట్ ప్రకారం తాము సీన్స్ క్రియేట్ చేస్తాం తప్పితే అందుకు వీలు కుదరదని చెప్పామని, దానిని మనసులో పెట్టుకుని ఆమె ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని వివరణ ఇచ్చారు. అంతేకాదు... ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపారు.
ఇది జరిగిన కొద్ది రోజులకు అనుగ్రహ యూటర్న్ తీసుకుంది. ఏప్రిల్ చివరి వారంలో తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ లేఖను పెట్టింది. ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత సంబంధిత వ్యక్తులతో చర్చలు జరిపిన తర్వాత తాను ఇకపై ఎవరిపై ఎలాంటి ఆరోపణలు చేయాలని అనుకోవడం లేదని, ఈ నిర్ణయంతో తాను ఓడిపోయినట్టు కాదని, మానసిక ప్రశాంతత కోసమే దీనిని తీసుకున్నానని వివరించింది. ఇకపై 'రిసార్ట్' టీమ్ పై ఎలాంటి ఆరోపణలు తాను చేయదలుచుకోలేదని చెప్పింది. దాంతో అంతా కథ సుఖాంతమైందని భావించారు. ఆ తర్వాత రెండు మూడు ఎపిసోడ్స్ లో శ్రీనిధి పాత్రను మేకర్స్ చూపించారు. ఆమె కూడా ఈ వెబ్ సీరిస్ లో కొనసాగుతోందనే భావనే అందరికీ కలిగింది. అయితే గత శుక్రవారం ఎపిసోడ్ లో శ్రీనిధి పాత్రను ఒకే ఒక్క డైలాగ్ తో మాయం చేసేశారు. రూమ్ సర్వీస్ హెడ్ నోటితో ఆ మాటలు చెప్పించారు. 'శ్రీనిధి చెప్పాపెట్టకుండా ఓ వీడియో సందేశాన్ని ఇచ్చి ఉద్యోగానికి రిజైన్ చేసేసింది' అనిపించారు. గతంలో ఏదైనా డైలీ సీరియల్ నుండి నటీనటులు తప్పుకుంటే వాళ్ళకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుగానో కథలో రాసేవారు. లేదంటే ఆ స్థానంలో మరో నటుడిని తీసుకొచ్చి... వీక్షకుల మనో ఫలకం మీద నుండి పాత పాత్రధారి పోయేలా చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీనిధి పాత్రను సునాయాసంగా ఒక్క డైలాగ్‌తో వెబ్ సీరిస్ నుంచి పంపేశారు.

దీనిని బట్టి శ్రీనిధి పాత్ర పోషించిన అనుగ్రహ నంబియార్ తను చేసిన ఆరోపణల కారణంగా ఈ టీమ్ లో కొనసాగి ఉండలేకపోయి ఉండాలి. లేదంటే... ఆమె వెబ్ సీరిస్ నుంచి తనంత తానుగా తప్పుకునే విధంగా మేకర్స్ ప్రవర్తించి ఉండాలి. ఈ రెండింటిలో ఏది జరిగిందనేది అనుగ్రహ నోరు తెరిచి చెబితే కానీ తెలియని పరిస్థితి. నిజం ఎప్పుడు బయటకు వస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ
ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్
ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’