'రిసార్ట్' సీజన్ వన్ చివరికొచ్చేసింది...
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:26 PM
'రిసార్ట్' వెబ్ సీరిస్ మొదటి సీజన్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెలాఖరుతో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరిస్ ఫస్ట్ సీజన్ కు ఫుల్ స్టాప్ పడబోతోంది.
విజయ్ కుమార్ రాజేంద్రన్, అభినయ నేత్రన్ జంటగా రూపుదిద్దుకున్న 'రిసార్ట్' వెబ్ సీరిస్ మొదటి సీజన్‌కు గుమ్మడి కాయ కొట్టేశారు. ఆగస్ట్ 15వ తేదీతో ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ కు చెందిన వంద ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయ్యింది. ఇంటర్ తప్పిన ఓ గ్రామీణ యువకుడు, సిటీకి వచ్చి చెఫ్ అవ్వాలనుకున్న తన కోరికను ఎలా తీర్చుకున్నాడన్నదే ఈ వెబ్ సీరిస్ ప్రధానాంశం. కొన్నేళ్ళుగా రచన, దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న విజయ్ కుమార్ రాజేంద్రన్ దీనికి కథ, సంభాషణలు అందించాడు. అంతేకాదు ఇందులోని వెట్రీ అనే ప్రధాన పాత్రను పోషించాడు. ప్రవీణ్ బెన్నెత్ దర్శకత్వం వహించిన 'రిసార్ట్స్' వెబ్ సీరిస్ ఈ యేడాది మార్చి 13న జియో హాట్ స్టార్ లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం నాలుగు ఎపిసోడ్స్ చొప్పున ప్రసారం చేస్తూ వచ్చారు. తమిళంలో పాటు వివిధ భాషల్లో దీనిని టెలికాస్ట్ చేశారు. ఆగస్ట్ 14వ తేదీతో 'రిసార్ట్స్' వెబ్ సీరిస్ 92 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ పూర్తయ్యింది. బాలెన్స్ ఉన్న ఎనిమిది ఎపిసోడ్స్ షూటింగ్‌ను తాజాగా పూర్తి చేసేశారు. సో.. మొదటి సీజన్ ఆగస్ట్ నెలాఖరుతో పూర్తి కాబోతోంది.
ఈ వెబ్ సీరిస్ కథంతా ఆర్.ఆర్. రిసార్ట్స్ లోనే జరుగుతుంది. తన ఊరికే చెందిన ఉత్తమన్ (బడవ గోపి) సిఫార్స్ తో రూమ్ సర్వీస్ బోయ్ గా పనిచేయడానికి వెట్రీ (విజయ్ కుమార్ రాజేంద్రన్) వస్తాడు. ఎప్పటికైనా ఆర్.ఆర్. రిసార్ట్స్ కు మూల స్థంబమైన చీఫ్ చెఫ్ నెడుమారన్ (తలైవాసల్ విజయ్) అంత పేరు తెచ్చుకోవాలని అతని కోరిక. అయితే తమ కుటుంబాన్ని వదిలేసి, కష్టాల పాలు చేసి వెళ్ళిపోయిన తన తండ్రి చిదంబరం (గంజా కరుప్పు) అదే రిసార్ట్స్ లో పనిచేసిన విషయం వెట్రీకి తెలియదు. రూమ్ సర్వీస్ బోయ్ గా పనిచేస్తూనే తన ప్రతిభను నిరూపించుకుని రిసార్ట్స్ లోని కిచెన్ లో కొంతకాలం చెఫ్ గా ఉంటాడు వెట్రీ. అక్కడి ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగా తిరిగి రూమ్ సర్వీస్ లోకి వస్తాడు. రిసార్ట్స్ ఓనర్ రఘుపతి (ఎలంగో కుమరన్)కి వెట్రీ అంటే మొదటి నుంచి సదభిప్రాయం ఉంటుంది. అతను చిదంబరం కొడుకు అని తెలిసిన తర్వాత అది ఇంకా పెరుగుతుంది. నెడుమారన్ కూతురు, అదే రిసార్ట్స్ లో సూ చెఫ్ గా ఉన్న ఐశ్వర్య (అభినయ నేత్రన్) అంటే వెట్రీకి తెలియని అభిమానం కలుగుతుంది. ఆమెలోని సింగింగ్ టాలెంట్ ను పదిమందికి తెలియచేయాలని అతను తహతహలాడుతుంటాడు. తన తండ్రి కోరిక మేరకు ఐశ్వర్య చెఫ్ గానే కెరీర్ కొనసాగించాలని అనుకుంటుంది. రఘుపతి ప్రోత్సాహంతో, తన కెదురైన అడ్డంకులను అధిగమించి వెట్రీ ఎలా స్టార్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచాడు అనేది ఫస్ట్ సీజన్ క్లయిమాక్స్ గా తెలుస్తోంది.
ఇందులో కీలక పాత్రలను సాయి ధన్య, కవిప్రియ జయవేల్, ప్రియాకృష్ణన్, దర్శన శ్రీపాల్, విష్ణు బాలా, లల్లు, అమర్ కీర్తి, సౌందర్య శరవణన్, ఎలంగో కుమరన్ తదితరులు పోషించారు. వీరంతా పెద్ద గుర్తింపు ఉన్నవారు కాకపోయినా... సహజ నటనతో బాగానే ఆకట్టుకున్నారు. నేపథ్యం కొత్తగా ఉండటం, కిచిన్ అండ్ రిసార్ట్ పాలిటిక్స్ ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ప్రవీణ్ సక్సెస్ అయ్యాడు. అలానే ఏప్రిల్ నెలలో ఈ వెబ్ సీరిస్ లో నటించిన మలయాళ నటి అనుగ్రహ ఎన్ నంబియార్ ఇందులోని వెట్రీ పాత్రధారి, రచయిత విజయ్ కుమార్ పై చేసిన ఆరోపణలు, దానికి అతను చేసి ప్రత్యారోపణలతో ఈ వెబ్ సీరిస్ కొంత కాలం సోషల్ మీడియాలో నానింది. చివరి పది పన్నెండు ఎపిసోడ్స్ లో సీనియర్ తమిళ నటుడు ఎలంగో కుమరవేల్ 'రాజ్ దొరై' పాత్రతో ఎంట్రీ ఇవ్వడం, వెట్రీని స్టార్ చెఫ్ కాంపిటీషన్ కు అతను ప్రిపేర్ చేయడం వంటి సన్నివేశాలు... వెబ్ సీరిస్ గ్రాఫ్ ను బాగానే పెంచాయి. దాంతో దీనికంటూ వివిధ భాషల్లో అభిమానగణం ఏర్పడింది. శుక్రవారం కోసం ఎదురుచూడటం మొదలైంది. మరి తొలి వంద ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్న ఈ బృందం సెకండ్ సీజన్ ను ఎప్పుడు ప్రారంభిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి
బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్
రష్మిక షో ఆఫ్ కామెంట్స్‌పై యశ్ రియాక్షన్.. అసలు నిజం ఇదిగో