Irumudi OTT: మణెమ్మ, త్రినాథ్.. ఇంటికొచ్చేశారు
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:05 AM
రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి తెలుగు నాట సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం ఇరుముడి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి తెలుగు నాట సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం ఇరుముడి (Irumudi). చాలా కాలంగా అభిమానుల ఎదురుచూపులకు చెక్ పెట్టి ఫుల్ జోష్ నింపిన ఈ మూవీ విడుదలకు ముందు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచగా, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకుంది. భావోద్వేగాలు, సామాజిక అంశం, తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కలగలిపిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఉత్తరాంధ్రలోని పొల్లూరు గ్రామానికి చెందిన త్రినాథరావు (రవితేజ) అరటి తోటలు చూసుకుంటూ ఆటో నడిపే సాధారణ వ్యక్తి. అయ్యప్ప స్వామి మాల ధరించిన తర్వాత పుట్టిన తన కూతురు మణెమ్మ (నక్షత్ర) అంటే అతనికి ప్రాణం. భార్య కావేరి (ప్రియ భవానీ శంకర్), కుటుంబానికి అండగా నిలిచే గురుస్వామి (సాయికుమార్)తో కలిసి సాదాసీదా జీవితం సాగిస్తుంటాడు. అయితే మణెమ్మ చదువుకోసం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన తర్వాత అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆ స్కూల్‌లో వరుసగా విద్యార్థినుల మరణాలు కలకలం రేపుతుంటే, మణెమ్మ కూడా ఒక భయానక పరిస్థితిని ఎదుర్కొంటుంది. అసలు అక్కడ ఏమి జరుగుతోంది? ఆ నిజం ఎందుకు బయటకు రాలేదు? ఒక తండ్రిగా త్రినాథరావు తన కూతురి కోసం చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే కథలోని ప్రధాన అంశం.
థియేటర్లలో మంచి స్పందన పొంది దాదాపే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ ‘ఇరుముడి’ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద తెరపై మిస్ అయిన ప్రేక్షకులు, రవితేజ అభిమానులు, మరోసారి ఈ భావోద్వేగ కథను ఆస్వాదించాలని అనుకునే వారు ఇప్పుడు ఎంచక్కా ఇంటి నుంచే సినిమాను వీక్షించవచ్చు. అయితే.. సినిమా థియేటర్లకు వచ్చి నెల అవుతున్నా ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతూ ఉండడం గమనార్హం.