Dhurandhar OTT: దురంధర్ ఓటీటీకి వచ్చేశాడు! తెలుగులో కూడా.. సినీ లవర్స్‌కు ఇక పండగే
ABN, Publish Date - Jan 30 , 2026 | 05:27 AM
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్ల వద్ద సునామీ సృష్టించిన ఇంకా సృష్టిస్తోన్న బాలీవుడ్ చిత్రం దురంధర్ ఓటీటీకి వచ్చేసింది.
రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా అక్షయ్ ఖన్నా (Akshaye Khanna), సంజయ్ దత్, మాధవన్ (R. Madhavan), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) వంటి వెటరన్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం దురంధర్ (Dhurandhar). ఆదిత్య ధర్ (Aditya Dhar) స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే థియేటర్లకు వచ్చి బాక్సాపీస్‌కు పట్టిన బూజును దులిపేసింది. అంచనాలను మించి ప్రపంచ వ్యాప్తంగా రూ. 1350 కోట్లను మించి వసూళ్ళు సాధించింది. ఈ మూవీ విడుదలై రెండు నెలల కావస్తున్నా ఇప్పటికీ గట్టిగానే కలెక్షన్లు రాబడుతూ అందరినీ ఆశ్యర్య పరుస్తోంది. అలాంటి ఈ మూవీ ఈ రోజు (శుక్రవారం జనవరి 30) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ మూవీ ద్వారా సారా అర్జున్ (Sara Arjun) కథానాయికగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
కథ విషయానికి వస్తే.. సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తరుచూ భారత్‌పై ఏదో ఓ రకంగా దాడులు చేస్తూ సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత ఇంటిలిజెన్స్, ప్రభుత్వ సహకారంతో సైనిక శిక్షణలో రాటు దేలిన హంజా అలీ మజారీని అండర్ కవర్ స్పైగా పాకిస్తాన్‌లోని కరాచికి పంపిస్తుంది. అక్కడ ల్యారీ అనే టౌన్‌లో జ్యూస్ షాప్‌లో వెయిటర్, క్లీనర్‌గా పని చేస్తూ అక్కడ జరుగుతున్న పాలిటిక్స్, వర్గ పోరాటాలు, గొడవలను క్షుణ్ణంగా స్టడీ చేస్తాడు.
ఓ సందర్భంలో పఠాన్ గ్యాంగ్ రెహమాన్ డెకాయిట్ గ్యాంగ్‌పై సడన్‌గా దాడి చేయగా హంజా అడ్డుపడి రెహమాన్ చిన్న కుమారుడిని కాపాడుతాడు. ఆపై ఆ గ్యాంగ్‌లో చేరి క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ టీమ్‌లో కీలక వ్యక్తిగా మూడవ స్థాయికి చేరతాడు. ఓ దశలో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుకు పట్టుబడ్డ రెహమాన్‌ను తన తెలివితో బయటకు తీసుకు వస్తాడు.
అలాంటి... హంజా రాను రాను ఎలాంటి పనులు చేశాడు, రెహామాన్‌ను ఎందుకు చంపాడు? ఈ నేపథ్యంలో ఎలాంటి పర్యవసనాలు ఎదురయ్యాయి? అతనికి ఎవరు సాయం చేశారనే ఆసక్తికరమైన కథకథనాలతో రక్తి కట్టించే సన్నివేశాలతో సినిమా సాగుతుంది.
మూడున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రం క్షణం కూడా బోర్ కొట్టక పోగా చివరకు అప్పుడే అయిపోయిందా ఇంకా కాస్త ఉంటే బావుండు అనే ఫీల్ ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో మిస్సయిన వారు, అల్రెడి చూసిన వారు మరోసారి తప్పక చూసి తీరాల్సిన మూవీ ఇది. అయితే ఒకటి రెండు చోట్ల హింసాత్మక సన్నివేశాలు... మనం భరించ లేనంతగా, చూడలేని విధంగా ఉంటాయి. అసభ్యకర సన్నివేశాలైతే ఏమీ లేవు.