సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి.. హిరాణీ తొలి ప్రేమలేఖ 'ప్రీతం అండ్ పెడ్రో'

ABN, Publish Date - Jul 26 , 2026 | 06:46 AM

ఇప్ప‌టికే మున్నాభాయ్, పీకే, డంకీ, సంజు వంటి అణిముత్యాల్లాంటి చిత్రాల‌ను అందించిన ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణీ ఓటీటీకి అందించిన తొలి తొలి ప్రేమలేఖ ప్రీతం అండ్ పెడ్రో.

Pritam and Pedro

'త్రీ ఇడియట్స్' సినిమాను ఒక్కలైన్‌లో చెప్పండి అని ఎవరైనా అడిగితే "మీ పిల్లలను మీరనుకుంటున్నట్టు కాక.. వాళ్లు చదవాలనుకుంటున్నదే చదువుకోనీయండి" అని చెప్పామనుకోండి.. 'అవునా?' అని ఆశ్చర్యపోతారు ప్రశ్న అడిగినవాళ్లు. అదే దర్శకుడు రాజకుమార్ హిరాణీ (Rajkumar Hirani) గొప్పదనం. ఒక క్లిష్టమైన అంశానికి మాంచి చక్కెరపూత పూసి, వీలైతే కమ్మటి మసాలా కూడా కలిపి చెప్పడం. ఓటీటీకి హిరాణీ తొలి ప్రేమలేఖ మున్నాభాయ్, పీకే, డంకీ, సంజు అలాంటివే. ఇప్పుడు అదే హిరాణీ ప్రీతం అండ్ పెడ్రో (Pritam and Pedro) సిరీస్‌తో ఓటీటీలోకి వచ్చేశారు.

ఇది హిరాణీ ఓటీటీ ప్రపంచానికి రాసిన తొలి ప్రేమలేఖ. ఆ రాతల్లో ఆయనకు తెలిసిన మనుషులే ఉన్నారు, ఆయనకు అలవాటైన చిరునవ్వే ఉంది. అయితే ఇక్కడ దర్శకుడిగా కాకుండా, కేవలం నిర్మాతగా వచ్చాడు. దర్శకత్వం పని అవినాష్ అరుణ (Avinash Arun) కు అప్పగించాడు కానీ, అచ్చంగా హిరాణీ వాసనలే ఉన్నాయి సిరీస్ నిండా, హిరాణీ అనగానే మనకు గుర్తొచ్చే నవ్వుల్లో దాగిన కన్నీళ్లు, వినోదంలో కలిసిపోయిన సామాజిక వ్యాఖ్య. పాత్రల మీద ఏర్పడే అపురూపమైన మమకారం అన్నీ ఈ సిరీస్‌లో ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీ సినిమా అంటేనే అందులో హృదయాన్ని హత్తుకునే హాస్యం, బలమైన మానవీయ సంబంధాలు, సమాజానికి ఒక సందేశం ఉంటాయి. తను దర్శకుడిగా ఎంపిక చేసినవాడు తనలాగా ఉండాలనుకుని మాత్రమే ఎంపిక చేసి ఉంటే తప్పేమీ లేదు కనుక క్షమించేయొచ్చేమో.

గోవాలో నడిచే ఈ కథ.. కొన్ని కేసులను క్రాక్ చేయడం పైకి కనిపించే రూపం అయినా.. సోషల్ మీడియా విధ్వంసం, ఫోన్ మన జీవితాలను ఎంత బహిరంగం చేస్తుందో చెప్పడం, పిల్లలు వీడియో గేమ్స్ వల్ల ఎంత మానసిక హింసకు గురవుతున్నారో చర్చించడం అంతర్లీన అంశం. హిరాణీ తన ధోరణిలోనే సందేశం చుట్టూ.. నేరాన్నీ, హాస్యాన్నీ, మానవ నైజాన్నీ అల్లుకున్నాడు. సాంకేతికత ఎంత పెరిగినా, మనిషి బుద్ధి, అనుభవం, విశ్వాసం విలువ తగ్గదనే వాస్తవం కథ అంతటా పరుచుకుని ఉంటుంది. నేరం ఎంత ఆధునికమైనదైనా, దాన్ని ఎదుర్కొనేది చివరికి మనిషి బుర్రే అన్న సందేశం వినిపిస్తుంది. పాత తరం పోలీసు అధికారి పెడ్రో (అర్షద్ వార్సీ)కి కంప్యూటర్ల గురించి పెద్దగా తెలియదు. పాతకాలపు పద్ధతుల్లో ఆలోచించడం, ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కోవడం అతని నైజం. అలాంటి పెడ్రో జీవితంలోకి ప్రీతమ్ (వీర్ హిరాణీ) అనే ఒక విచిత్రమైన, అత్యంత తెలివైన సైబర్ హ్యాకర్, టెక్ ఎక్స్పర్ట్ ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తాడు అనేకంటే.. ఒక ఏటీఎమ్ చోరీని పదిహేను నిముషాలలో


ప్రీతమ్ పరిష్కరించడంతో, ఒక మంత్రి కుమారుడి కిడ్నాప్ కేసులో సహకారం కోసం ఆ హ్యాకర్‌ను తీసుకొస్తాడు పోలీసాఫీసర్. నిజానికి ఈ ఇద్దరూ కేసులను చూసే కోణాలు వేర్వేరు. ఒకరు అనుభవాన్ని నమ్మితే, మరొకరు డేటాను నమ్ముతారు. ఒకరు నేరస్థుడి కళ్లలో నిజం వెతికితే.. ఇంకొకరు స్క్రీన్ మీద కనిపించే కోడ్‌లో ఆధారాలు వెతుకుతారు. ఈ రెండు ప్రపంచాలు ఢీకొనడమే ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. సైబర్ క్రైమ్ అనే అంశాన్ని తీసుకున్నా, దాన్ని క్లిష్టమైన సాంకేతిక పదజాలంతో నింప లేదు. సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా సరళంగానే చెప్పారు. మొదటి మూడు ఎపిసోడ్లు పెడ్రో పాత్రను, అతని ఫెయిల్యూర్స్‌ను చూపిస్తూ చాలా సరదాగా సాగుతాయి. ప్రీతమ్ ఎంట్రీ తర్వాత కథ ఊపందుకుంటుంది. వీరిద్దరి మధ్య సంభాషణలు, ఒకరినొకరు ఆటపట్టించుకునే సన్నివేశాలు నవ్విస్తాయి.

పిల్లల మెదళ్లను పాడుచేసే ఓ వీడియో గేమ్ ను వీళ్లిద్దరూ ఎలా ఎదుర్కొన్నారు? ఆ 'కేసులో ఎలా కలిసి పనిచేశారు? పాతతరం ఆలోచనలున్న పెడ్రో, ఆధునిక సాంకేతికతతో దూసుకుపోయే ప్రీతమ్ కలిసి ఎలా ఒకే దారిలో నడిచారు? ఈ ప్రయాణంలో వారి మధ్య ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? అనేదే ఈ సిరీస్ ప్రధాన కథ. రాజ్కుమార్ హిరాణీ తరహా భావోద్వేగాలు శుభ్రమైన హాస్యం ఈ సిరీస్ అంతటా కనిపిస్తాయి. హిరాణీ సినిమాల్లో కథ కన్నా పాత్రలే ఎక్కువకాలం మనతో ఉంటాయి. ఈ సిరీస్ లోనూ అదే కనిపిస్తుంది. పెడ్రో పాత్రను అర్షద్ వార్సీ (Arshad Warsi) తన సహజమైన టైమింగ్‌తో అద్భుతంగా మోశాడు. అతని హాస్యం ఎక్కడా తెచ్చిపెట్టు కున్నదిగా అనిపించదు. ఒక చిన్న చూపు, ఒక సాధారణ డైలాగ్ కూడా నవ్వు తెప్పిస్తుంది. ప్రీతమ్ గా చేసిన వీర్ హిరాణీ (Vir Hirani) ఎవరో కాదు.. రాజ్ కుమార్ హిరాణీ కొడుకు. తండ్రి పేరు వల్ల వచ్చిన ఒత్తిడిని దాటుకుని సహజంగా నటించాడు. అతనికి స్టార్ ఇమేజ్ లేకపోవడంతో ఈ పాత్ర మరింత సహజంగా అనిపిస్తుంది. అర్షద్ వార్సీతో అతని కెమిస్ట్రీ సిరీస్‌కు బలం. అలాగే క‌థ‌ను మ‌లుపు తిప్పి సిరీస్‌ను మ‌రింత ఉత్కంఠ‌గా మార్చే పాత్ర‌లో బాలీవుడ్ సెన్షేష‌న్ విక్రాంత్ మెస్సే (Vikrant Massey) హ‌డ‌లెత్తించేశాడు.

దర్శకుడు అవినాష్ అరుణ్.. గోవాను కేవలం పర్యాటక ప్రాంతంగా చూపించకుండా, కథలో భాగంగా మలచడం బాగుంది. కెమెరా పనితనం ప్రశాంతంగా ఉంటుంది. నేపథ్య సంగీతం కూడా కథను మించిపోదు. ఎపిసోడ్లు చిన్నవిగా ఉండటంతో చూడడం సులభం. ఈ సిరీస్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది హిరాణీ ప్రపంచాన్ని ఓటీటీ భాషలోకి అనువదించే తొలి ప్రయత్నం. సినిమాల్లో మూడు గంటల్లో చెప్పే కథను ఇక్కడ ఆరు ఎపిసోడ్లలో చెప్పాల్సి వచ్చింది. కానీ ప్రతీ ఎపిసోడ్ చివర ప్రేక్షకుడిని తదుపరి భాగానికి లాగేసే హుక్లన్నీ బాగున్నాయి. సెల్‌ఫోన్ మన గురించి ఇతరులకు ఏం చెపుతుంది? మన రహస్యాలనీ, చేష్టలనీ, వెధవాయిత్వాన్నీ, అంతరంగిక సమాచారాన్నీ ఎలా బట్టబయలు చేయగలదు? అనే అంశాల్ని బాగా చెప్పారు. చివర్లో సంజయ్ దత్, వీరేంద్ర సెహ్వాగ్ కనపడడం బోనస్. హాస్యానికీ ఉత్కంఠకూ మధ్య నిలబడి.. చిరునవ్వుతో చూసే ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం 'ప్రీతమ్ అండ్ పెడ్రో'. ప్ర‌స్తుతం ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో హిందీతో పాటు తెలుగు భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది.

- ప్ర‌సేన్, 98489 97241

Updated Date - Jul 26 , 2026 | 08:51 AM