సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీ.. ల‌వ‌ర్స్‌కు బ్యాడ్ న్యూస్‌! ఇక 8 వారాల త‌ర్వాతే.. సినిమాలు

ABN, Publish Date - Feb 27 , 2026 | 09:48 AM

ఓ వైపు తగ్గిపోయిన స్టార్స్ మూవీస్ - మరోవైపు భారీ చిత్రాలకు టిక్కెట్ రేట్స్ హైక్ - ఇంకోవైపు ఓటీటీ బెడద- వీటన్నిటి కారణంగా థియేటర్స్ వెలవెల పోతున్నాయి. మరి థియేటర్స్‌కి ఆడియన్స్‌ను రప్పించాలంటే ఏం చేయాలి?.

ott

థియేటర్స్‌లో ఎంత బిగ్ హిట్ అయిన మూవీ అయినా సరే, ఓటీటీ (Ott) ప్లాట్ ఫామ్స్ ఒప్పందం ప్రకారం విడుదలైన కొద్ది వారాలకే ప్రదర్శించవలసిందే. దీనివల్ల థియేటర్ రన్ బాగున్నా, ఓటీటీలో రిలీజ్ కావడం వల్ల సినిమా హాళ్ళకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. నిజానికి కొందరు నిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు మంచి రేటుకు తమ సినిమాలను అమ్ముకొని, తద్వారా లభించే మొత్తంతో సినిమాలు పూర్తి చేస్తున్నారు. దాంతో వారు అగ్రిమెంట్ ప్రకారం సినిమా థియేటర్స్‌లో ఉన్నా, వెంటనే ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు టాప్ స్టార్స్ ఏడాదికి ఓ సినిమా చేస్తూ ఉండడంతో థియేటర్స్ దగ్గర కళ తగ్గిపోతోంది. అంతే కాదు టాప్ స్టార్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజయితే వారం, రెండు వారాల పాటు భారీ టిక్కెట్ రేట్స్ ఉంటున్నాయి. ఈ కారణంగానూ థియేటర్స్ కు పరుగులు తీసే జనం తగ్గిపోతున్నారు.

ఈ అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిబిటర్స్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో సినిమాలు రిలీజ్ చేసే సమయాన్ని మరింత పెంచాలని నిర్మాతలు యోచిస్తున్నారు. అందుకోసమై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్స్ హైదరాబాద్‌లో ఇటీవల సమావేశమయ్యారు. ఇకపై థియేటర్‌లో రిలీజైన తేదీ నుంచి ఎనిమిది వారాల తరువాతే ఓటీటీలో ఏ సినిమానైనా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు పెట్టగా ఈ ప్రపోజల్‌ను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఆమోదించింది. ఈ సమావేశంలో సురేశ్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు, టాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఏ సినిమానైనా థియేటర్స్‌లో రిలీజైన ఎనిమిది వారాల తరువాతే ఓటీటీలో ప్రదర్శించాలన్న నిర్ణయానికి ఛాంబర్ ఓకే అంది.

ఈ అంశాన్ని నిర్మాతల మండలి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తోనూ చర్చించనున్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మరోమాట ఉండదని ఛాంబర్ ఈసీ మెంబర్స్ అంటున్నారు. ప్రస్తుతం 60 శాతంపైగా షూటింగ్ జరుపుకున్న చిత్రాలను మినహాయించి కొత్తగా మొదలయ్యే సినిమాలకు ఈ ఎనిమిది వారాల గడువు వర్తించేలా చేయనున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన ఈ ఎనిమిది వారాల నిబంధనను అనుసరిస్తున్నారు. 'పీవీఆర్ - ఐనాక్స్' చెయిన్ ఉత్తరాదిన ఓటీటీతో ఎనిమిది వారాల అగ్రిమెంట్ చేసుకున్న చిత్రాలనే తమ థియేటర్స్ లో ప్రదర్శించడానికి అంగీకరిస్తోంది. సౌత్ లోనూ 'పీవీఆర్ - ఐనాక్స్' చెయిన్ ఉన్నప్పటికీ ఇక్కడ వీరికంటే బలమైన నిర్మాతలు, థియేటర్స్ వారు కొందరు తమ ఇష్టానుసారంగా ఓటీటీతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఇకపై దేశవ్యాప్తంగా ఎనిమిది వారాల గడువును అనుసరించే దిశగా ఛాంబర్ అడుగులు వేయనుంది.

కేవలం ఎనిమిది వారాల తరువాతే ఓటీటీలో సినిమాలు ప్రదర్శించే రూల్ వస్తే థియేటర్స్ కాసింత ఊపిరి పీల్చుకుంటాయి. అదేవిధంగా హీరోలు, దర్శకులు కూడా అడ్వాన్స్ తీసుకుని రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకునే విధానం కూడా అమలు చేయగలిగితే నిర్మాతలు తమ చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోగలరు. అప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై ఎక్కువగా ఆధారపడవలసిన అవసరం ఉండదు. అలాగే టాప్ స్టార్స్ కూడా ఏడాదికి కనీసం రెండు చిత్రాల్లో నటిస్తూ సాగితే నెలకు రెండు పెద్ద సినిమాలయినా రిలీజయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు థియేటర్స్ కొంతమేరకు కళకళలాడగలవు. ఏది ఏమైనా థియేటర్స్ మనుగడ కోసం ఛాంబర్ తీసుకొనే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటాయని భావించవచ్చు. ఏమవుతుందో చూద్దాం.

Updated Date - Feb 27 , 2026 | 10:11 AM