Your Backers Play: నో.. సబ్స్క్రిప్షన్! ఉచితంగా.. సినిమాలు చూడొచ్చు
ABN, Publish Date - Aug 24 , 2026 | 09:58 AM
ఓటీటీ ప్రపంచంలోనే.. తొలిసారిగా ఎలాంటి లాభాపేక్షలేకుండా ఓ డిజిటల్ యాప్ ప్రారంభమైంది.
యువర్ బ్యాకర్స్ ఫౌండేషన్ (Your Backers Foundation) యువర్ బ్యాకర్స్ ప్లే (YourBackers Play) పేరుతో నూతన ఓటీటీ డిజిటల్ ప్లాట్‌ఫాం ఆవిష్కరించింది. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కిశోర్ ఆదిత్య మాట్లాడుతూ, 'యువర్ బ్యాకర్స్ ప్లే ఓటీటీ ప్రపంచం లోనే తొలి లాభ రహిత డిజిటల్ ఓటీటీ యాప్. ఇందులో ఉచితంగా సినిమాలు చూడొచ్చు.
ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫాంను తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, సీనియర్ నటుడు ఎస్వీ శేఖర్ తదితరుల సమక్షంలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. యువర్ బ్యాకర్స్ ఫౌండేషన్ ప్రారంభించి ఆరేళ్ళవుతుంది. పుదుచ్చేరిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ తర్వాత సముద్రంలో ప్లాస్టిక్ క్లీన్ డ్రైవ్ చేపట్టి గిన్నిస్ రికార్డు సృష్టించాం. మా సేవలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ప్రధాన ఓటీటీలో ప్రేక్షకులు పెద్ద సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. మా ఫ్లాట్‌ఫామ్‌లో చిన్న చిత్రాలను ప్రేక్షకుల చెంతకు చేరేలా ఓ ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఎలాంటి సబ్స్క్రిప్షన్ రుసుం చెల్లించాల్సిన పనిలేదు. ఉచితంగా సినిమా చూడొచ్చు. ఇంపాక్ట్ టికెట్ అనే ఆప్షన్ ఉంది. అందులో ప్రేక్షకులు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వొచ్చు.
ఆ మొత్తంలో సింహభాగం సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తాం. మరికొంత మొత్తాన్ని చిత్ర నిర్మాతకు అందజేస్తాం. ఔట్రైట్, షేరింగ్ విధానంలో చిత్రాలను కొనుగోలు చేసి ఈ ఫ్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ చేస్తాం. ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అభివృద్ధి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలకు కొంతమొత్తంలో శాశ్వత ఆదాయాన్ని సమకూర్చిపెడుతుంది. మనం ప్రయత్నించే సాధ్యంకానిది ఏదీ లేదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన ప్రయత్నం చేస్తే అంతా మంచే జరుగుతుంది' అని పేర్కొన్నారు.