Nagababu: 'మేము COPలం' వెబ్ సీరిస్ రివ్యూ
ABN , Publish Date - May 24 , 2026 | 07:32 PM
జీ 5తో కలిసి బీవీయస్ రవి, కౌముది నిర్మించిన వెబ్ సీరిస్ 'మేము COPలం' ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ నటుడు నాగబాబుతో పాటు గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ఇందులో కీలక పాత్రలు పోషించారు.
ఈ మధ్య కాలంలో టైటిల్‌తో కాస్తంత క్యూరియాసిటీని కలిగించిన వెబ్ సీరిస్ ఏదైనా ఉందంటే అది 'మేము COPలం'. కుల ప్రస్తావనతో వెబ్ సీరిస్ ఏమిటీ? అని చాలామంది సందేహపడేలా చేసి, దానిపై కాస్తంత క్రేజ్‌ను తీసుకు రాగలిగారు. అయితే... ఆ సస్పెన్స్ ను వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ వరకు సాగతీయకుండా... ఇది ఇద్దరు కాప్స్ కు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని, అదీ తప్పిపోయిన పందెం కోడి పుంజు చుట్టూ తిరిగే కథ అని రివీల్ చేసేశారు. ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న పందెం కోడిపుంజు కిడ్నాప్ వెనుక ఉన్న డ్రామా ఏమిటో తెలుసుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లా మహదేవ పట్టణంలో జరిగే కథ ఇది. ఆ వూరిలోని మోతుబరి రైతు గజపతిరాజు (నాగబాబు) ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్‌లో తన ఊరిలో కోడి పందాలను ఘనంగా జరుపుతుంటాడు. ఆయన పెంచే కోడిపుంజే పందెంలో గెలుస్తుంటుంది. ఎలాగైనా గజపతి రాజు మీద తమది పైచేయి కావాలని ఆ ఊరికే చెందిన సుధాకర్ రెడ్డి (శ్రీధర్ రెడ్డి), మహిపాల్ రెడ్డి (కమల్) ప్రయత్నిస్తుంటారు. అందుకోసం తమ కోళ్ళను పందానికి సిద్థం చేస్తారు. త్వరలో కోడి పందాలు మొదలు అవుతాయనగా గజపతి రాజు ప్రేమతో పెంచిన పందెం కోడి 'సలార్ రాజ్' తప్పిపోతుంది. దాంతో అందరి దృష్టిలో సుధాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి మీద పడుతుంది. తప్పిపోయిన గుజపతి రాజు కోడిని వెతికే బాధ్యతను సోటారి బ్రదర్స్ అని పిలిచే ఎస్.ఐ. రవి (రవితేజ నన్నిమాల)కి, కానిస్టేబుల్ మోహన్ (గెటప్ శ్రీను) కు డీఎస్పీ అప్పగిస్తాడు. ప్రజలలో ఏమాత్రం గౌరవంలేని ఎస్.ఐ. రవి, అతని తమ్ముడి వరస అయ్యే కొత్త కానిస్టేబుల్ మోహన్ 'సలార్ రాజు' కిడ్నాప్ మిస్టరీని ఎలా ఛేదించారన్నదే ఈ వెబ్ సీరీస్ కథ.

పెంపుడు జంతువులు తప్పిపోతే కొందరు చేసే హడావుడి అంతాఇంతా కాదు. నగరాల్లో డబ్బున్న వాళ్ళ ఇంటిలోని పెంపుడు కుక్క తప్పిపోతే వాళ్ళు చేసే హంగామా, తమ పరపతిని ఉపయోగించి దానిని ట్రేసౌట్ చేయడానికి చేసే ప్రయత్నాలు అప్పుడప్పుడు వార్తలలో చూస్తూనే ఉంటాం. ఇంటిల్లిపాది తిండీ తిప్పలు మానేసి తప్పిపోయిన పెట్ యానిమల్ కోసం వెతికిస్తూనే ఉంటారు. ఓ రకంగా ఇందులో గజపతి రాజుది అదే తరహా పాత్ర. సొంత కొడుకులా పెంచి, పెద్ద చేసిన పందెం కోడిపుంజు తప్పితే... ఎలా తల్లడిల్లిపోయాడు? తన పరపతిని ఏ స్థాయిలో ఉపయోగించాడు? అనేది చూపించారు. ఎందుకూ పనికిరాని దద్దమ్మలు అనిపించుకున్న ఇద్దరు కాప్స్ సలార్ రాజును పట్టుకునే క్రమంలో ఊరిలో జరుగుతున్న దారుణాలను వెలికి తీయడం, వాటిని అడ్డుకోవడమే ఈ వెబ్ సీరిస్ లోని కీలకమైన అంశం. ఇవాళ కోస్తా జిల్లాలు అనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాలలో చాపకింద నీరులా గంజాయి ముఠాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఆ పాయింట్‌ను పందెం కోడి కిడ్నాప్ డ్రామాకు ముడిపెట్టడంతో ఇదో అర్థవంతమైన వెబ్ సీరిస్‌గా అనిపించుకుంది. అయితే ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. ఇవాళ వెబ్ సీరిస్ లను చాలా క్రిస్ప్ గా, జన్ జీ మెచ్చేలా తీస్తున్నారు. కానీ ఇందులో అన్నీ పాత పోకడలే. మేకింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మరింతగా ఇది వీక్షకులను మెప్పించి ఉండేది. పరిమితమైన బడ్జెట్‌లో, అతి తక్కువ రోజుల్లో ఆరు ఎపిసోడ్స్ ను తీసేశారంటే... మేకర్స్ ఎంతలా రాజీ పడిఉంటారో అర్థమౌతోంది. అయితే మొదటి రెండు, మూడు ఎపిసోడ్స్ సాదాసీదాగా సాగినా... ఐదు, ఆరు ఎపిసోడ్స్ లోని ట్విస్ట్ ఊహకందనిది ఉంది. దాంతో చివరి ఎపిసోడ్స్ తో కథ తిరిగి ట్రాక్‌లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారి అయిన 'టైటాన్'ను చూపించకపోవడంతో మరో సీజన్ కు రంగం సిద్థం చేసినట్టైంది.

నటీనటుల విషయానికి వస్తే.. సీనియర్ నటుడు నాగబాబు తన పాత్రను చక్కగా పోషించారు. సొటారీ బ్రదర్స్ గా గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల హుషారుగా నటించారు. న్యూస్ ప్రెజెంటర్‌గా నటించిన రీతు చౌదరి పాత్ర భిన్నంగా, ఆసక్తికరంగా ఉంది. ఇతర ప్రధాన పాత్రలను చరణ్ లక్కరాజు, సిరి పార్వతి, కిరీటి దామరాజు, అనంత్ ప్రభు, కమల్, శ్రీధర్ రెడ్డి, బుగత సత్యనారాయణ తదితరులు పోషించారు. శోభన్ చిత్తుప్రోలు కథను అందించడంతో పాటు చాణక్య వర్మ, గోపాలకృష్ణ విద్మహే తో కలిసి సంభాషణలు రాశారు. కానీ అవి ఏ మాత్రం బాగాలేవు. సాకేత్ కొమాండూరి నేపథ్య సంగీతం మొదటి నాలుగు ఎపిసోడ్స్ తో పోల్చితే ఐదు, ఆరు ఎపిసోడ్స్ లో బాగుంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం కూడా చెప్పుకోదగ్గదిగా లేదు. జీ 5తో కలిసి దీనిని బీవీయస్ రవి, కౌముది నిర్మించారు. సీనియర్ రచయిత, దర్శకుడు, నిర్మాత అయిన బీవీఎస్ రవి మేకింగ్ మీద కూడా కాస్తంత దృష్టి పెట్టి ఉండాల్సింది. అప్పుడిది ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇందులో కాప్స్ గా నటించిన గెటప్ శ్రీను, రవితేజ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్స్ కాబట్టి... ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఓసారి చూడొచ్చు.