సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Unmadham Review: నెమ్మదిగా మొదలై ఊపిరి బిగబట్టేలా చేసే క్రైమ్ మిస్టరీ!

ABN, Publish Date - Sep 05 , 2026 | 04:42 PM

మలయాళ హీరో కుంచాకో బోబన్, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం.

Unmadham

మలయాళ హీరో కుంచాకో బోబన్ (Kunchacko Boban), లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం(Unmadham). ఈ సినిమాకు ప్రసిద్ధ ఎడిటర్ కిరణ్ దాస్ తొలిసారిగా దర్శకత్వం వహించగా, క్రైమ్ థ్రిల్లర్లకు పేరొందిన షాగీ కబీర్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జులై 31న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న అనంతరం, సెప్టెంబర్ 04 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీ ప్రియులకు ఈ సినిమా నచ్చిందో లేదో చూద్దాం.


కథ విషయానికొస్తే షెల్లీ (కుంచాకో బోబన్) ఒక కానిస్టేబుల్. భార్య సౌమ్య (లిజోమోల్ జోస్), ఇద్దరు పిల్లలతో ఒక పోలీస్ క్వార్టర్స్ నివసిస్తూ ఉంటాడు. అతనికి పోలీస్ కన్నా రైటర్ అవ్వాలని కల. జాబ్ కి లీవ్ పెట్టి నిర్మాతల చుట్టూ తన కథను వినమని తిరుగుతూ ఉంటాడు. అయితే ఆయన కథల్లో లాజిక్ లేదని అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో రైటర్ కలను పక్కనపెట్టి భార్య కోసం పోలీస్ జాబ్ కి తిరిగి వెళతాడు. అక్కడ సినిమాలకు మంచి కథ రాయాలని తపించే షెల్లీకి ఓ పాత అనుమానాస్పద మృతి ఫైల్ దొరుకుతుంది. ఆ కేసుతో అనుబంధమున్న ప్రతీ ఒక్కరి జీవితంలోనూ విచిత్రమైన సంఘటనలు జరిగాయని, ఆ ఫైల్ శాపగ్రస్తమైనది అని ప్రచారం ఉంటుంది. తన సినిమా కథ కోసం పరిశోధనగా ఆ ఫైల్‌ను తిరగేయడం ప్రారంభించిన షెల్లీ, క్రమంగా ఆ కేసులోని డార్క్ మిస్టరీలోకి కూరుకుపోతాడు. ఆ క్రమంలో అతని మానసిక స్థితికి ఏమైంది.. ? ఆ శాపగ్రస్తమైన ఫైల్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి.. ? చివరకు షెల్లీ అనుకున్నది సాధించాడా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


సినిమా మొదటి 20 నిమిషాలు చాలా నెమ్మదిగా మొదలవుతుంది. షెల్లీ- సౌమ్య కుటుంబం, వారు పడే గొడవలు.. ఇబ్బందులు అన్నీ రొటీన్ డ్రామాలా అనిపిస్తుంది. ఎప్పుడైతే షెల్లీ పోలీస్ స్టేషన్ లో ఆ శాపగ్రస్త ఫైల్ మీద చేయి పెడతాడో అప్పటి నుంచి కథలో వేగం పుంచుకోవాడమే కాకుండా ప్రేక్షకుడిలో ఆసక్తి మొదలవుతుంది. మూఢ నమ్మకాలు అని కొట్టిపడేసిన షెల్లీ.. ఆ ఫైల్ వలన జరిగిన ప్రమాదాలను తెలుసుకొని అతను కూడా మానసిక రోగిలా మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు కిరణ్ దాస్ టేకింగ్, మూడ్ క్రియేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రథమార్థంలో ఇన్వెస్టిగేషన్ డ్రామా, సూపర్‌నేచురల్ మైండ్ గేమ్‌లతో థ్రిల్ పంచిన దర్శకుడు, ద్వితీయార్థంలో రెగ్యులర్ క్రైమ్ ఎలిమెంట్స్ వల్ల కొంత నెమ్మదించినట్లు అనిపిస్తుంది. న్యాయం కోసం ఒక ఆత్మ చేసే పోరాటమే ఈ సినిమా. ఇలాంటి లైన్ తో ఎన్నో హర్రర్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఆత్మ మరణించడం, దాని వెనుక కారణం ప్రేక్షకుల్లో అంత ఇంపాక్ట్ కలగజేసేలా డైరెక్టర్ రాయలేకపోయాడు అని చెప్పవచ్చు.


మొదటి నుంచి ఆ ఫైల్ ని ముట్టుకున్నవారందరికీ ఏదో ఒకటి అవుతుంటే.. ఆ ఆత్మకు ఏదో పెద్ద నష్టమే కలిగి ఉంటుందని అనుకుంటారు. కానీ, చివర్లో వారి ఫ్లాష్ బ్యాక్ చూశాకా.. అరే దీనికి ఎందుకు అంత బిల్డప్ ఇచ్చారు అనేలా ఉంటుంది. కాంచనలో ఆల్రెడీ ఇలాంటి రీజనే లారెన్స్ చూపించాడు. ఇప్పుడు ఇందులో కూడా అదే చూపించారు. ఇక అర్జున్ సేతు డార్క్ సినిమాటోగ్రఫీ, జస్టిన్ వర్గీస్ అందించిన ఊపిరి బిగబట్టించే రీ-రికార్డింగ్ కథలోని సస్పెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. భార్యాభర్తలుగా కుంచాకో బోబన్, లిజోమోల్ జోస్‌ల నటన అత్యంత సహజంగా నిలిచింది. ముఖ్యంగా కుంచాకో మానసిక రోగిలా నటించే సన్నివేశాలు చాలా అద్బుతంగా ఉంటాయి. మొత్తానికి, సాధారణ మాస్ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా, మనిషి అంతరంగాన్ని, మానసిక సంఘర్షణను ఆవిష్కరించే విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్మాదం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కాకపోయినా మైండ్ గేమ్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్, మిస్టరీ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మస్ట్ వాచ్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Updated Date - Sep 05 , 2026 | 04:49 PM