Isakapatnam: 'స్పై' దర్శకుడి కొత్త వెబ్ సీరిస్...
ABN, Publish Date - Jun 11 , 2026 | 04:29 PM
'స్పై' మూవీ ఫేమ్ గ్యారీ బిహెచ్ రూపొందించిన వెబ్ సీరిస్ 'ఇసాకపట్నం'. పోర్ట్ టౌన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్‌లో సముతిరకని, ఐశ్వర్య రాజేశ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు.
పలు తెలుగు సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బి.హెచ్. నిఖిల్ హీరోగా 'స్పై' సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. అయితే అంతటితో నిరాశ చెందకుండా ఇప్పుడో వెబ్ సీరిస్ ను రూపొందించాడు గ్యారీ బి.హెచ్. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో గ్యారీ బి.హెచ్. క్రియేట్ చేసిన 'ఇసాకపట్నం' వెబ్ సీరిస్ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
ఏడు ఎపిసోడ్స్ ఉండే యాక్షన్ థ్రిల్లర్ 'ఇసాక పట్నం'లో సముతిరకని, ఐశ్వర్య రాజేశ్, సునీల్, నరేశ్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కొమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజా చేంబోలు కీలక పాత్రలు పోషించారు. ఈ సీరిస్ కు ప్రశాంత్ రఘతి కథను అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. దీనినిన రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు.
ఈ వెబ్ సీరిస్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఇసాకపట్నం’ ఒక రివెంజ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. వ్యక్తిగత నష్టం, విశ్వాసం, కుటుంబ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరాటం వంటి అంశాలను భావోద్వేగంగా మిళితం చేసిన కథ. ఒక పోర్ట్ టౌన్ ప్రపంచాన్ని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించడానికి మా బృందం ఎంతో కృషి చేసింది. ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ప్రైమ్ వీడియో లో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఒక కల్పిత పోర్ట్ టౌన్‌లో ఈ కథ జరుగుతుందని, ప్రతీకారం, భావోద్వేగాలు, అనూహ్య మలుపులతో నిండిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్, ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్ టైటిల్స్ తో దీనిని చూడొచ్చని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Lust Stories: లస్ట్ స్టోరీస్.. వైబ్రేటర్ సీన్‌కు కథ ఏంటంటే..
Sanjeev Megoti: బాధలో అన్న మాటలే తప్ప.. కావాలని అన్నవి కాదు..