OTT: ఈ ఓటీటీలు మాకొద్దు.. చూసే సినిమా కన్నా వచ్చే యాడ్స్ ఎక్కువ!
ABN, Publish Date - Jan 21 , 2026 | 12:09 PM
ప్రతి మనిషికి తిండి, బట్ట, ఇల్లుతో పాటు ఓటీటీ సబ్ స్క్రిప్సన్ తప్పని సరి అనే పరిస్థితి వచ్చేసింది.
సగటు సినీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడం కోసం ఓటీటీ (OTT) లు నిత్యం పొటీలు పడుతూ ఎప్పటికప్పడు వినూత్న కంటెంట్‌తో అలరిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రతి ప్రేక్షకుడికి నిత్యావసర సరుకుగా ఓటీటీ మారిపోయింది. ఈ క్రమంలో ప్రతి మనిషికి తిండి, బట్ట, ఇల్లుతో పాటు ఓటీటీ సబ్ స్క్రిప్సన్ తప్పని సరి అనే పరిస్థితి వచ్చేసింది. పొద్దస్తమానం పని చేసి ఇంటికి వచ్చిన వారికి, నేటి జన్ జీ టెక్ యూత్‌కు డిజిటల్ స్ట్రీమింగ్ జీవితంలో ఓ భాగమైంది. అది లేకుండా ఉండడం, రోజుకు కనీసం ఒక్క సారైనా చూసి తీరాల్సిందే అనేంతగా ప్రజలు అడిక్ట్ అయ్యారు అవుతున్నారు.
ముఖ్యంగా మన తెలుగు నాట అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీ విషయంలో ముందుండగా ఇటీవల అనుహ్యంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) స్పీడు పెంచి వీటన్నింటిని తోసివేసి ఫస్ట్ ఫ్లేస్‌లోకి వచ్చేసింది. కొత్త సినిమా అంటే నెట్‌ఫ్లిక్స్ అనేలా పేరు తెచ్చుకుంది. అయితే దీని వ్యయం మిగతా వాటికన్నా కాస్త ఎక్కువ కావడంతో ఇంకా అందరికీ అందుబాటులో లేదు గానీ తెలుగు కంటెంట్‌ను మాత్రం భారీగా రిలీజ్ చేస్తుంది. అయితే.. దీనికి పోటీగా ఉన్న ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, జీ5 (Zee5) వంటి దిగ్గజ ఓటీటీలు మంచి పోటీనే ఇస్తున్నాయి. కొత్త, విభిన్న కంటెంట్ కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నాయి కూడా. ఏడాది క్రితం జియో వారు ఈ హాట్‌స్టార్‌ను టేకోవర్ చేసుకున్నాక కంటెంట్ రెండింతలు కాగా విదేశీ కంటెంట్ కూడా భారీగా వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలోనే సబ్ స్క్రిప్షన్ చార్జీలు పెంచిన జియో మరోసారి ధరలను పెంచి వీక్షకులకు షాకిచ్చింది.
అయితే.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ (SonyLIV), లయన్ గేట్స్ వంటి ఓటీటీలు ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వకుండా వీక్షకులు, సబ్ స్ట్రైబర్ల డబ్బుకు న్యాయం చేస్తూ వారికి పరిపూర్ణమైన ఎంటర్ టైన్‌మెంట్ ఇవ్వడంతో పాటు విలువైన సమయాన్ని సేవ్ చేస్తున్నాయి. కానీ జియో హాట్ స్టార్, జీ5, ఆహా , అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రధాన ఓటీటీలు మాత్రం సబ్ స్ట్కైబర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉపయోగించే మొబైల్, సూపర్, ఇంకా బేస్ ఫ్లాన్లు ఉన్న వారు ఏదైన కంటెంట్ చూస్తున్న సమయంలో యాడ్స్‌ను రెట్టింపు స్థాయిలో ఇస్తుండడంతో చూసే వారికి విసుగు తెప్పిస్తున్నాయి. అవి వచ్చినప్పుడు సినిమా మధ్యలో యాడ్స్ వస్తున్నాయా లేక యాడ్స్ మధ్యలో సినిమా వస్తుందా అనే ఫీలింగ్ రాక మానదు. వీటికన్నా టీవీలు నయం గదరా నాయనా అంటూ నిట్టూరుస్తున్నారు. చూసే కార్యక్రమం కన్నా వచ్చే యాడ్స్ అధికమై వీక్షకుల సహానాన్ని పరీక్షిస్తున్నాయి. ఒక్కోసారి అసలు ఈ హాట్ స్టార్, జీ5, ఆహా సబ్ స్క్రిప్సన్లు ఎందుకు తీసుకున్నామురా అని తల పట్టుకునేలా చేయడంతో పాటు చేతిలోని రిమోట్‌ను నేలకేసి కొట్టేలా బీపీలు పెంచేస్తున్నాయి.
మరోవైపు.. ఓ పండగో, పబ్బమో, సెలవో వచ్చింది కదా అని మన ఇంట్లో ఆడవాళ్లు, ముసలి వాళ్లు, పిల్లలు ఇలా ఇంటిల్లి పాది కలిసి టూరిస్టు ఫ్యామిలీ లాంటి సినిమాను చూద్దామని హాట్ స్టారో, ఆహానో ఏదో ఓ ఓటీటీ ఆన్ చేసి చూస్తుంటే సినిమా మధ్యలో ఉండగా సడన్‌గా కండోమ్‌లు, పాన్ మసాలాల వంటి యాడ్స్‌తో పాటు తమ వద్ద ఉన్న బోల్డ్ సినిమాలు, సిరీస్‌లు క్లిప్పులు పదే పదే వేస్తూ వీటిని కూడా చూసేయండి అంటూ టీవీ చూసే ఫ్యామిలీ మెంబర్స్‌ను బెదర గొడుతున్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులకు కొత్త తలనొప్పి వచ్చి పడుతుంది. కొంపతీసి పిల్లలు ఎవరైనా వాటిని చూసి అదేం సినిమా, అదేం యాడ్ డాడీ, మమ్మీ అని అడిగితే ఏం చెప్పాలో దిక్కుతోచని అయోమయ సిట్యూవేషన్ ఏర్పడుతోంది.
దీంతో ఇదెక్కడి ఖర్మరా మనకు.. మనం ఇప్పుడు చూసే సినిమా ఏంటి, వచ్చే యాడ్స్ ఏంటి అని ఫ్యామిలీల ముందు ఓటీటీలు ఆన్ చేయడానికి, ఒక వేళ ఆన్ చేసినా ఏ నిమిషంలో.. ఎలాంటి యాడ్ చూడాల్సి వస్తుందో అని భయం, భయంగా ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి అని అనడంలో తప్పు లేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా మందికి ఎదురవుతున్నాయి. దీంతో వీటిపై సదరు ఓటీటీ సంస్థలు దృష్టి సారించాలని యాడ్స్ ఒకటి కాకుంటే మూడు నాలుగు ఎక్కువ వేసుకోండి మా బాధ మీం పడతాం గానీ సబ్ స్క్రైబర్స్ ఫలానా కంటెంట్ చూస్తున్నప్పుడు వాటికి రిలేటెడ్‌గా ఉన్న యాడ్స్ మాత్రమే వేస్తే బావుంటుందని సూచిస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమాలు చూసే వారికి కాస్త ప్రశాంతత, తృప్తి ఉంటుందని లేకుంటే సదరు పబ్లిక్ ఓటీటీలకు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాలపై వైపు మళ్లే అవకాశం ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు.
దీంతో ఈ మధ్య వీటి సబ్‌స్క్రిప్షన్లు తీసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుండగా దాని స్థానంలో అనేక మంది థర్ట్ పార్టీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ తమకు కావాల్సిన సినిమాలు, సిరీస్‌లు డౌన్‌లోడ్ చేసుకుని టీవీకి కనెక్ట్ చేసుకుని హాయిగా ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్లు లేకుండా చూసేస్తున్నారు. మరికొంతమంది డైరెక్ట్ అన్‌లైన్‌లోనే చూసి మమా అనిపిస్తున్నారు. ఇక భవిష్యత్తులోనైనా ఈ ఓటీటీల తీరు మారకుంటే మరింత మంది ఈ ఆన్‌లైన్ దారిలోకి వచ్చే అవకాశం లేక పోలేదు.