Gedela Raju: 50 మిలియన్ వాచ్ మినిట్స్ దాటిన రఘు కుంచే మూవీ
ABN, Publish Date - Aug 08 , 2026 | 04:00 PM
థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘గేదెలరాజు’ ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది.
థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న‘గేదెలరాజు’ (Gedela raju) ఓటీటీలోనూ (OTT) తన సత్తా చాటుతోంది. ఏప్రిల్ 24, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన రఘు కుంచె, సంగీతం కూడా అందించారు. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమాను మరోసారి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ‘గేదెలరాజు’ ఒకటిగా నిలవగా.. ఆహాలోనూ ట్రెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. 50 మిలియన్ల వాచ్ మినిట్స్‌ను దాటినట్లు దర్శకుడు సోషల్ మీడియాలో పోస్టర్ ను షేర్ చేశారు.
చైతన్య మోటూరి దర్శకత్వంలో మోటూరి క్రియేషన్స్ పతాకంపై రఘు కుంచే సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కించారు. తొలి చిత్రంతోనే తనదైన కథన శైలిని చూపించిన చైతన్య.. నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు. వికాస్, టీనా శ్రావ్య, రామచంద్రం, మోనికా కలపాల, రవి చిన్నిబిల్లి, శ్రీకాంత్ అయ్యంగార్, బాషా, దివ్య మోటూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.