ఈటీవీ విన్‌లో ఆకట్టుకుంటున్న 'ఈఎంఐ' మూవీ!

ABN , Publish Date - Mar 12 , 2026 | 02:13 PM

అభినవ్‌ మణికంఠ, నేహ పఠాన్‌ జంటగా తెరకెక్కిన లఘు చిత్రం 'ఈఎంఐ'. కిరణ్‌ తుమ్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

EMI Short Movie

మధ్యతరగతి మందహాసం వెనుక కనిపించని వెతలు ఎన్నో ఉంటాయి. బతుకు బండిని ఈడ్చే జంటలకే ఈ విషయం ఎక్కువగా అర్థమౌతుంది. అలాంటి ఓ ప్రేమ జంట 'ఈఎంఐ'ల కారణంగా ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుందనే అంశంతో తెరకెక్కిన సినిమా 'ఈఎంఐ'. ఈటీవీ కథాసుధ శీర్షికలో ఈ లఘు చిత్రం ప్రస్తుతం ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతోంది.


అభినవ్ మణికంఠ (Abhinav Manikanta), నేహా పఠాన్ (Neha Pathan), నవీన్‌, దువ్వాసి మోహన్‌, రాధాకృష్ణ తేలు, దీపక్‌ మేర్ల, సర్కార్‌ ప్రధాన పాత్రలు పోషించిన 'ఈఎంఐ' (EMI) సినిమాను స్వీయ దర్శకత్వంలో కిరణ్‌ తుమ్మ (Kiran Thumma) నిర్మించారు. దీనికి నరేన్‌ ఆర్. కె. సిద్ధార్థ్‌ సంగీతాన్ని సమకూర్చారు.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ జంట సంసార జీవితం సాజావుగా సాగుతూ ఉంటుంది. అంతలో అనుకోకుండా ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి. దాంతో తీర్చాల్సిన అప్పులు, కట్టాల్సిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు, ఆర్థిక పరమైన చికాకులు చుట్టు ముడతాయి. ఈ ఆర్థిక భారం వారి వైవాహిక జీవితం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇంతలో భార్య నెల తప్పుతుంది. ఈఎంఐలు కట్టడానికే ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో పిల్లలను కనడం అవసరమా? అనే సందేహం ఆమెకు వస్తుంది. మరి ఈ కల్లోల సమయంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రేమ జంట తమ ఆర్థిక సమస్యల నుండి ఎలా బయటపడింది? అనేది మిగతా కథ.

emi 1.jpg


ఈఎంఐ అంటే ఈక్వెటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్... అయితే ఈ సినిమా టైటిల్ కు ట్యాగ్ లైన్‌ మాత్రం 'ఎవ్విరి మంత్ ఇన్ సెక్యూర్‌' అని పెట్టారు. ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకున్న వారు ప్రతి నెలా ఇన్ సెక్యూరిటీతో బతకాల్సిందేనని దర్శకుడు చెప్పదల్చుకున్నాడు. మధ్యతరగతి వారికి సంబంధించిన అంశాలతో దీనిని రూపొందించడంతో ప్రతి ఒక్కరూ ఈ లఘు చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతు బాధ్యతలకు పూర్తి న్యాయం చేకూర్చారు. జన్ జీ వారికీ 'ఈఎంఐ' ఓ మేలుకొలుపు, మార్గదర్శి అనుకోవచ్చు.

Updated Date - Mar 12 , 2026 | 02:19 PM