Dridam: అదేం క్లైమాక్స్ రా మావా.. మెంటలొచ్చేస్తది అంతే
ABN, Publish Date - Jun 12 , 2026 | 09:06 PM
ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్స్ కి మంచి డిమాండ్ ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టింగ్ థ్రిల్లర్స్ అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ ని దృశ్యం లాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నిర్మిస్తే.. దృశ్యం ఫ్యాన్స్ అసెంబెల్ అయిపోరు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్స్ కి మంచి డిమాండ్ ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టింగ్ థ్రిల్లర్స్ అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ ని దృశ్యం లాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నిర్మిస్తే.. దృశ్యం ఫ్యాన్స్ అసెంబెల్ అయిపోరు. దర్శకుడు జీతూ జోసెఫ్ నిర్మాణంలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన చిత్రం దృఢం. షేన్ నిగమ్ (Shane Nigam), శోభి తిలకన్ (Shobi Thilakan), కొట్టాయం రమేశ్, దినేశ్ ప్రభాకర్, నందన్ ఉన్ని కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 8 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు నెల తరువాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 12 నుంచి జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక థియేటర్ లోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆకట్టుకొంటుంది. కథ విషయానికొస్తే.. విజయ్ రాధాకృష్ణన్ (షేన్ నిగమ్) అనే ఒక యువ పోలీస్ ఆఫీసర్‌కు హిల్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రశాంతమైన రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ వస్తుంది. ఎలాంటి పెద్ద క్రైమ్ రికార్డ్స్ లేని ఆ ఏరియాలో చాలా హ్యాపీగా డ్యూటీ చేయొచ్చు అనుకుంటున్న తరుణంలో.. ఊహించని విధంగా అక్కడ ఒక కుళ్ళిపోయిన శవం బయటపడుతుంది, ఆ వెంటనే ఒక లోకల్ బ్యాంక్ రాబరీ.. వెంటనే ఇంకో రెండు హత్యలు జరుగుతాయి. ఈ బ్యాక్-టు-బ్యాక్ క్రైమ్స్ వల్ల పబ్లిక్ నుంచి, అధికారుల నుంచి విజయ్‌పై తీవ్రమైన ప్రెజర్ పెరుగుతుంది. అంత ఒత్తిడిని విజయ్ ఎలా మ్యానేజ్ చేశాడు..? అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? బ్యాంక్ దోపిడీ వెనుక ఉన్నది ఎవరు? విజయ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడనేదే మిగతా కథ.
స్టోరీ లైన్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. మొదటి భాగం అంతా విజయ్ రావడం, మిగతా కోలీగ్స్ అందరూ అతనిని రిసీవ్ చేసుకోవడం, హత్య, దోపిడీ.. ఇలా సాగిపోతుంది. ఇక ఎప్పుడైతే విజయ్ ఒక్కో క్లూ వెతుకుతూ వస్తాడో చూసే ప్రేక్షకుడిలో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.. లాస్ట్ 20 నిమిషాల క్లైమాక్స్ అని చెప్పాలి. అసలు ఊహించని విధంగా వచ్చే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ మరియు క్లైమాక్స్‌లో వచ్చే హై-వోల్టేజ్ వైల్డ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను సీటు ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఎవరూ ఊహించని వారు ఆ హత్యలు చేశారు అని తెలిసి విజయ్ ఎంత ఆశ్చర్యపోతాడో.. అదే ఆశ్చర్యం ప్రేక్షకుడిలో ఉంటుంది. ముఖ్యంగా మొదటినుంచి విజయ్ వెంటపడిన అమ్మాయి కూడా అందులో భాగమని తెలిసినప్పుడు అవాక్కవడం ఖాయమని చెప్పాలి. ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు. ఇక్కడ విజయ్ కూడా హంతకులను పట్టుకోలేడనిపిస్తుంది. ఇక హత్యలకు కారణం మాత్రం సాధారణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి కారణం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన తుడురమ్ లో కూడా ఇదే పాయింట్ ఉంటుంది.
మలయాళ సినిమాలు చాలా స్లోగా సాగుతాయి. ఇది కూడా అలాగే ఉంటుంది. క్లైమాక్స్ బాగున్నప్పటికీ.. అక్కడివరకు కథను నడిపించిన విధానం చాలా స్లోగా, సాగదీసినట్లు ఉంటుంది. డైలాగ్స్ చాలా ఆర్టిఫిషియల్‌గా, ప్రేక్షకుడికి ప్రతి విషయాన్ని స్పూన్ ఫీడింగ్ లాగా విడమర్చి చెప్పడం మైనస్ గా మారింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే చాలా సీన్లు రొటీన్ క్రైమ్ ప్రొసీజరల్ సినిమాలను గుర్తుచేస్తాయి. జీతూ జోసెఫ్ మార్క్ సస్పెన్స్ ఇంటెన్సిటీ క్లైమాక్స్‌లో ఉన్నంతగా.. సినిమా అంతటా మెయింటైన్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఇక కొత్తగా జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్‌గా, ఆ ప్రెజర్‌ను తట్టుకునే పాత్రలో షేన్ నిగమ్ తన బాడీ లాంగ్వేజ్‌తో చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హంతకులు ఎవరు అని తెలిసినప్పుడు.. నమ్మినవారే మోసం చేశారు అనే బాధ, పోలీస్ గా తన కర్తవ్యాన్ని నిర్వహించాలనే తపన .. మిక్స్డ్ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన శోభి తిలకన్, దినేష్ ప్రభాకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, సాయిల్ సాజి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టించినా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆ బోర్ మొత్తాన్ని పోగొట్టేలా చేస్తుంది అని చెప్పవచ్చు. వీకెండ్ కి కుటుంబం మొత్తం కూర్చొని ఒకసారి దృఢం చూడొచ్చు.