Anakapalli: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దూసుకెళ్తున్న ‘అనకాపల్లి’!
ABN, Publish Date - Nov 14 , 2026 | 10:55 AM
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ఠ జంటగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే.
విక్రమ్ సహిదేవ్(Vikram Sahidev), సంధ్య వశిష్ఠ జంటగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం డిజిటల్ వేదికపై మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఓటీటీ ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్ కుర్రాడు.. తన ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించే ఓ పవర్ఫుల్ రౌడీకి ఆకర్షితుడవడం ఈ సినిమా ప్రధాన కథాంశం. టీనేజ్ వయసులో బలమైన వ్యక్తిత్వం, పలుకుబడి ఉన్న వ్యక్తుల పట్ల యువతలో కలిగే ఆకర్షణను దర్శకుడు ఆసక్తికరంగా ఆవిష్కరించారు. యుక్తవయసులో ఉండే ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలను కథలో భాగంగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సహిదేవ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన పాత్రలోని అమాయకత్వాన్ని, టీనేజ్ వయసులో ఉండే సహజమైన భావోద్వేగాలను చక్కగా పలికించారు. ముఖ్యంగా ప్రేమ, ఆకర్షణ, అమాయకత్వం వంటి భావాలను సహజంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మరోవైపు తారక్ పొన్నప్ప తనదైన నటనతో బలాన్ని చేకూర్చారు. ఇలా ఆసక్తికరమైన కథాంశం, మంచి నటన, కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం గమనార్హం.
థియేటర్లలో పెద్దగా గుర్తింపు పొందని కొన్ని చిత్రాలకు ఓటీటీ వేదికలు మరో అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ‘అనకాపల్లి’ కూడా అదే కోవలోకి వస్తోంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఓటీటీ సమీక్షలు చెబుతున్నాయి. ఓటీటీలో ఈ సినిమా దుమ్మురేపుతోంది. విక్రమ్ సహిదేవ్ నటన గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. విభిన్నమైన కథలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించే సామర్థ్యం ఆయనలో కనిపిస్తోందని కొనియాడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు, వైవిధ్యమైన పాత్రలు ఆయనకు దక్కితే నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశముందని చెబుతున్నారు. మంచి కథ, సహజమైన నటన ఉన్న చిత్రాలకు ఆలస్యంగానైనా గుర్తింపు లభిస్తుందనడానికి ‘అనకాపల్లి’ ఒక ఉదాహరణ.