Lenin OTT: లెనిన్.. ఓటీటీకి వచ్చేశాడు
ABN, Publish Date - Aug 07 , 2026 | 08:14 AM
సుదీర్ఘమైన ఎదురుచూపుల తర్వాత తిరుగులేని విజయాన్ని దక్కించుకుని అక్కినేని అభిమానులకు మంచి జ్ఞాపకం అందించిన చిత్రం లెనిన్.
సుదీర్ఘమైన ఎదురుచూపుల తర్వాత తిరుగులేని విజయాన్ని దక్కించుకుని అక్కినేని అభిమానులకు మంచి జ్ఞాపకం అందించిన చిత్రం లెనిన్. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లకు వచ్చిన ఈ మూవీ సంవత్సరాలుగా హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్ అంతకుమించి నాగార్జునలకు మరిచిపోలేని చిరస్మరణీయ సక్సెస్‌ను అందించింది. అంతేగాక ఆ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరి నాగ చైతన్య తర్వాత ఈ రికార్డు సొంతం చేసుకున్న రెండో అక్కినేని హీరోగా పేరు లిఖించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా అందరికి అందుబాటులో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని శ్రీరామపురం అనే గ్రామం ఈ కథకు నేపథ్యం. గ్రామ సంప్రదాయాలు, కుటుంబ విలువలు, అధికారం కోసం జరిగే పోరాటం చుట్టూ కథ సాగుతుంది. ప్రతి ఏడాది జరిగే ద్రౌపది ఉత్సవాలు ఆ ఊరి ప్రత్యేకత. ఆ పండుగ రోజుల్లో గ్రామంలో ఎలాంటి రక్తపాతం జరగకూడదనే ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. అనాథ బాలుడిగా గ్రామంలో అడుగుపెట్టిన లెనిన్ (అఖిల్ అక్కినేని)ని గ్రామ పెద్ద జయంతి (ఈశ్వరీరావు) తన సొంత కుమారుడిలా పెంచుతుంది. కాలంతో పాటు లెనిన్ గ్రామంలో అందరి అభిమానాన్ని సంపాదించుకుంటాడు.
ఇదే సమయంలో తన బంధువుల కుటుంబానికి చెందిన భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమలో పడతాడు. ఇద్దరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరిస్తారు. అయితే, ప్రశాంతంగా కనిపించే ఆ గ్రామంలో పైకి కనిపించని ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది. అధికారం, స్వార్థం, పాత కక్షలు ఒక్కొక్కటిగా బయటపడటంతో లెనిన్ జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడవడంతో అతడు ఊహించని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి జైలుకు వెళ్లిన లెనిన్, తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? తనపై జరిగిన అన్యాయానికి ఎలా సమాధానం చెప్పాడు? గ్రామ రాజకీయాల వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ఈ సినిమా కథ దాదాపు అందరికీ తెలిసిందే అయినా.. నడిపించిన విధానం కొత్తగా ఉండి చూసే ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మహా భారతంలో అధికారం కోసం అన్నదమ్ములు సాగించిన కురుక్షేత్ర యుద్థాన్ని తలపించే తరహా సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం జీ5 (ZEE 5) ఓటీటీలో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్సయిన వారు, అక్కినేని ఫ్యాన్స్ తో సహా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసేయవచ్చు. అఖిల్ (Akhil Akkineni) యాక్టింగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. కథానాయిక భాగ్య శ్రీ భోర్సేకి మంచి పాత్ర లభించింది.