పాతికేళ్ళు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ 'ఖుషి'

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:55 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఖుషి' మూవీకి ఓ స్పెషల్ ప్లేస్ ఉంది. అలాంటి 'ఖుషి' సినిమా పాతికేళ్ళ క్రితం ఏ తీరున మురిపించిందో గుర్తు చేసుకుందాం.

Pawan Kalyan Khushi

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం 'ఖుషి' (Khushi). 2001 ఏప్రిల్ 27న విడుదలైన 'ఖుషి' చిత్రం 71 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఆ యేడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. ఎస్.జె. సూర్య (SJ Surya) దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం (A.M. Rathnam) నిర్మించిన 'ఖుషి'లో భూమిక (Bhoomika) కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ (Manisharma) సమకూర్చిన సంగీతం పెద్ద ఎస్సెట్. ఇందులోని పాటలను చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ్, ఎ.ఎమ్.రత్నం, అబ్బాస్ టైర్వాలా రాశారు. 1955 నాటి 'మిస్సమ్మ' చిత్రంలోని పింగళి రాసిన 'ఆడువారిమాటలకు అర్థాలేవేరులే.' పాటను రీమిక్స్ చేసి అలరించారు. అలా పాటలతో ఫ్యాన్స్ కు 'ఖుషీ' చేస్తూ సాగిందీ చిత్రం.


పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఓ పాప, ఓ బాబు చేతులు అనుకోకుండా తగులు కుంటాయి. పెద్దయ్యాక వారిద్దరికీ పరిచయం కావడం, అది ప్రణయంగా మారడం, పరిణయానికి దారితీయడం సాగి కథ సుఖాంతమవుతుంది. ఈ కథలో హీరో, హీరోయిన్ మధ్య సాగే సీన్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాలని నిర్మాత ఎ.ఎమ్.రత్నం ప్లాన్ చేశారు. తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించారు. అయితే పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తెలుగు వర్షన్ లేట్ గా ఆరంభమయింది. తమిళంలో ఓ యేడాది ముందుగా రిలీజైన 'ఖుషి'మంచి విజయం సాధించింది. దానిని మించి తెలుగు 'ఖుషి' ఘనవిజయం సొంతం చేసుకుంది.


రీ-రిలీజ్ లోనూ 'ఖుషి'...

'ఖుషి' చిత్రం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఏడవ సినిమా. అంతకు ముందు కళ్యాణ్ నటించిన ప్రతి సినిమా ఒకదానిని మించి మరోటి హిట్టవుతూ ఆయన సక్సెస్ ట్రాక్ సాగింది. 'ఖుషి' చిత్రం అన్నిటినీ మించి పవన్ కెరీర్ లో వసూళ్ళ పరంగా, హండ్రెడ్ డేస్ సెంటర్స్ పరంగా రికార్డ్ సృష్టించింది. కొన్ని కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుందీ చిత్రం. అందుకే ఈ నాటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు 'ఖుషి' అంటే ఎంతో ఇష్టం. ఈ సినిమాను ఆ మధ్య రీ-రిలీజ్ చేస్తే ఏడున్నర కోట్ల రూపాయలు సంపాదించింది. దీనిని బట్టే ఫ్యాన్స్ కు 'ఖుషి' అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Apr 27 , 2026 | 06:13 PM