సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యన్టీఆర్ 'పల్నాటి యుద్ధము'కు 60 ఏళ్ళు...

ABN, Publish Date - Feb 18 , 2026 | 05:15 PM

తెలుగు చరిత్రలో నిలచిన యుద్ధాలలో 'పల్నాటి యుద్ధం' ప్రత్యేకమైనది. ఈ కథను అభినవ భారతం అనీ పిలుస్తారు. యన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రలుగా అరవై ఏళ్ళ క్రితం రూపొందిన 'పల్నాటి యుద్ధము' తెలుగు జనాన్ని అలరించింది.

Palnati Yudham Movie

'పల్నాటి యుద్ధం' (Palnati Yudham) పేరుతో 1947లోనే ఓ చిత్రం వెలుగు చూసింది. గూడవల్లి రామబ్రహ్మం (Gudavalli Ramabrahmam) ఆరంభించిన ఆ సినిమాను ఎల్.వి. ప్రసాద్ (L.V. Prasad) పూర్తి చేశారు. ఇందులో బ్రహ్మనాయుడుగా గోవిందరాజుల సుబ్బారావు, నాయకురాలు నాగమ్మగా కన్నాంబ, బాలచంద్రునిగా ఏయన్నార్, మాంచాలగా యస్. వరలక్ష్మి నటించారు. ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. 'పల్నాటి యుద్ధం' కథలోని అన్నదమ్ముల పోరు భారతాన్ని తలపిస్తుంది. అందువల్లే శ్రీనాథుడు సైతం 'పల్నాటి వీరచరిత్రము' రాసి సాహితీ ప్రియులకు ఆనందం పంచారు. అంతటి చరిత్రను మరోమారు తెరకెక్కించాలని టి.హనుమంతరావు, వై.లక్ష్మయ్య చౌదరి, డి.సూర్యనారాయణ భావించారు. వీరు నిర్మించిన 'పల్నాటి యుద్ధము' గుత్తా రామినీడు దర్శకత్వంలో 1966 ఫిబ్రవరి 18న విడుదలయింది. ఇందులో యన్టీఆర్ (NTR) బ్రహ్మనాయుడుగా, నాగమ్మగా భానుమతి (Bhanumathi) నటించారు. ఎల్వీ ప్రసాద్ 'పల్నాటి యుద్ధం'కు భిన్నంగా బ్రహ్మనాయుడు పాత్ర ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో రామినీడు తన చిత్రంలో చూపించారు. బ్రహ్మనాయుడుగా యన్టీఆర్ తన నటవిశ్వరూపం ప్రదర్శించారు.


'పల్నాటి యుద్ధము' చిత్రం విడుదలైనప్పుడు కొందరు అదే పనిగా విమర్శలు గుప్పించారు. సద్విమర్శకులు యన్టీఆర్, భానుమతి నటనను ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఈ చిత్రానికి నెలరోజుల ముందు వచ్చిన యన్టీఆర్ 'శ్రీక్రిష్ణపాండవీయం' , ఆ తరువాత నెలన్నరకే విడుదలయిన యన్టీఆర్ 'పరమానందయ్య శిష్యుల కథ' చిత్రాల మధ్య 'పల్నాటి యుద్ధము' అంతగా మెప్పించలేక పోయింది. కానీ, తరువాతి రోజుల్లో 'పల్నాటి యుద్ధము' నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలు చేకూర్చింది. ఇందులో బాలచంద్రునిగా హరనాథ్, మాంచాలగా జమున అభినయించారు. అలరాజుగా కాంతారావు, నలగామరాజుగా గుమ్మడి, నరసింహరాజుగా రాజనాల, మలిదేవరాజుగా ఎమ్.బాలయ్య నటించారు. ఈ చిత్రానికి ఎస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు 13వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ప్రశంసా పత్రం లభించింది.


పలనాడు సీమలోని మాచర్ల, గురజాల మధ్య సాగిన పోరు చరిత్రలో 'పల్నాటియుద్ధం'గా నిలచింది. ఆ రోజుల్లో నాయకరాజులు కోడి పందేలను సంప్రదాయంగా భావించేవారు. ఆ కోడి పందేల కారణంగానే 'పల్నాటి యుద్థాని'కి తెరలేచిందనీ ప్రతీతి. ఆ నాటి కోడి పందేల సంప్రదాయం తెలుగునేలపై ఈ నాటికీ కొనసాగుతూనే ఉండడం విశేషం. ఇక 'పల్నాటి యుద్ధము' తరువాత పల్నాటి నేపథ్యంలో కృష్ణ (Krishna) 'పల్నాటి సింహం', బాలకృష్ణ (Balakrishna) 'పల్నాటి పులి, పల్నాటి బ్రహ్మనాయుడు' వంటి సినిమాలు తెరకెక్కాయి. ఏది ఏమైనా ఈ నాటికీ 'పల్నాటి యుద్ధము' అనగానే యన్టీఆర్ బ్రహ్మనాయుడుగా ఊహించుకొనే సినీ అభిమానులే అధికంగా ఉన్నారని చెప్పక తప్పదు.

Updated Date - Feb 18 , 2026 | 05:19 PM